హెచ్‌‌‌‌సీఏ నిధుల పై ప్రచారం పచ్చి అబద్ధం..విశాక ఇండస్ట్రీస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి

హెచ్‌‌‌‌సీఏ నిధుల పై ప్రచారం పచ్చి అబద్ధం..విశాక ఇండస్ట్రీస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  • వైఎస్సార్ హయాంలో హెచ్‌‌‌‌సీఏకు ఉప్పల్‌‌‌‌లో భూమి ఇప్పించాం
  • ఎవరూ ముందుకు రాని సమయంలో నిర్మాణానికి సహకరించాం 
  • రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం బాధాకరం
  • కోర్టు తీర్పుతో  వచ్చే నిధులను గ్రామీణ క్రికెట్ అభివృద్ధికే కేటాయిస్తం
  • అసత్యాలు రాసిన పత్రికకు పరువు నష్టం నోటీసులు పంపించామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌సీఏ), విశాకఇండస్ట్రీస్ స్పాన్సర్‌‌‌‌షిప్ ఒప్పందాలపై కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమనికార్మిక శాఖ మంత్రి డాక్టర్​ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వారికి ఇప్పటికే పరువు నష్టం నోటీసులు పంపించామని చెప్పారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి ఏ సంస్థ ముందుకురాని తరుణంలో విశాకఇండస్ట్రీస్ సహాయ, సహకారాలు అందించిందని, ఈ వ్యవహారంలో తమకు అనుకూలంగా హైకోర్టు, సుప్రీంకోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని వివరించారు. శనివారం హైదరాబాద్‌‌‌‌లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వివేక్​ వెంకటస్వామి మాట్లాడారు.  

గురువారెడ్డి అనే వ్యక్తి లోకాయుక్తలో చేసిన ఫిర్యాదు పూర్తిగా నిరాధారమైనదని, తాము దీనిని చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కేవలం తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని దీటుగా ఎదుర్కొంటామని, అదే సమయంలో కోర్టు ద్వారా వచ్చే నిధులను తిరిగి గ్రామీణ క్రికెట్ అభివృద్ధికే కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే హెచ్‌‌‌‌సీఏలో లూటీ జరిగిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఈ విషయంలో ‘నమస్తే తెలంగాణ’లాంటి పత్రికలకు తాము ఇప్పటికే పరువు నష్టం నోటీసులు అందజేసినట్టు వివరించారు.

ఏ కార్పొరేట్ సంస్థ ముందుకు రాని వేళ.. అండగా నిలిచినం..

ఒకప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌‌‌కు కనీసం సొంత మైదానం గానీ, కార్యాలయంగానీ ఉండేది కాదని మంత్రి వివేక్‌‌‌‌ తెలిపారు.  మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి హయాంలో తమ సోదరుడు వినోద్ చొరవ తీసుకొని హెచ్‌‌‌‌సీఏకు ఉప్పల్‌‌‌‌లో భూమి కేటాయించేలా  కృషి చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ఒక అంతర్జాతీయస్థాయి క్రికెట్ స్టేడియం ఉండాలనే దూరదృష్టితోనే తాము ఆ రోజుల్లో భూమి ఇప్పించామని చెప్పారు. స్థలం లభించినప్పటికీ స్టేడియం నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా మారిందన్నారు. 

అలాంటి పరిస్థితుల్లో స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తమ కుటుంబం ఎంతో కష్టపడిందని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని వివరించారు. కేవలం తెలంగాణలో క్రీడల అభివృద్ధిని కాంక్షించి తాము చేసిన సహాయాన్ని నేడు కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శించడం ఎంతో బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

నిధుల కొరతతో స్టేడియం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, హెచ్‌‌‌‌సీఏ ప్రతినిధులు దేశవ్యాప్తంగా ఎందరినో సంప్రదించారని వివేక్ తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌‌‌‌లాంటి ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు రాబట్టాలని చూసినా ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు. ఆ సమయంలో హెచ్‌‌‌‌సీఏ కార్యదర్శిగా ఉన్న శివలాల్ యాదవ్ తమ తండ్రి, దివంగత కాకా వెంకటస్వామిని కలిసి విశాకఇండస్ట్రీస్ ద్వారా సహాయం చేయాలని అభ్యర్థించారని చెప్పారు. 

కాకా ఆదేశాల మేరకు విశాకఇండస్ట్రీస్ స్పాన్సర్‌‌‌‌గా వ్యవహరించేందుకు ధైర్యంగా ముందుకు వచ్చామని చెప్పారు. స్టేడియం నిర్మాణం కోసం విశాకఇండస్ట్రీస్ కోట్లాది రూపాయల నిధులను హెచ్‌‌‌‌సీఏకు అందించిందని స్పష్టం చేశారు. ఈ స్పాన్సర్‌‌‌‌షిప్ ఒప్పందానికి హెచ్‌‌‌‌సీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం) లో కూడా పూర్తిస్థాయి ఆమోదం లభించిందని, అంతా పారదర్శకంగానే జరిగిందని పేర్కొన్నారు.

కొందరు స్వార్థపరుల వల్లే వివాదాలు..

స్టేడియం నిర్మాణం పూర్తై ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌లు ప్రారంభమైన తర్వాత కొందరు స్వార్థపరుల వల్ల వివాదాలు మొదలయ్యాయని వివేక్ వివరించారు. ఒప్పందం ప్రకారం విశాకఇండస్ట్రీస్‌‌‌‌కు దక్కాల్సిన అడ్వర్టైజ్‌‌‌‌మెంట్ హక్కులను ఐపీఎల్ సమయంలో ఇవ్వడానికి హెచ్‌‌‌‌సీఏ నిరాకరించిందని తెలిపారు. దీనిపై తాము న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని, చివరకు హైకోర్టు విశాకఇండస్ట్రీస్‌‌‌‌కు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. 

హైకోర్టు తీర్పును సవాల్‌‌‌‌ చేస్తూ హెచ్‌‌‌‌సీఏ ప్రతినిధులు సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ, అక్కడ కూడా విశాకఇండస్ట్రీస్ హక్కులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించిందని చెప్పారు. ఒప్పందం ప్రకారం 15 ఏండ్లపాటు దక్కాల్సిన ప్రకటనల హక్కులను ఏకపక్షంగా రద్దు చేయడం చట్టవిరుద్ధమని కోర్టులు స్పష్టం చేశాయని వివరించారు. కమర్షియల్ కోర్టు సైతం ఆర్బిట్రేషన్ అవార్డును సమర్థిస్తూ తీర్పునిచ్చిందన్నారు.   

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల వెలికితీతకు కృషి..

విశాక ఇండస్ట్రీస్ ఎల్లప్పుడూ క్రీడల ప్రమోషన్ కోసమే పనిచేస్తుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో కృషి చేస్తోందని వివేక్ వివరించారు. తాము గతంలో అనేక డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లకు స్పాన్సర్‌‌‌‌గా వ్యవహరించామని, తెలంగాణలోని క్రీడాకారులకు నిరంతరం ప్రోత్సాహం అందించామని తెలిపారు. 

ఇటీవల కాలంలో దాదాపు రూ.2.5 కోట్ల వ్యయంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌‌‌‌ను హెచ్‌‌‌‌సీఏ భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. భవిష్యత్తులో కోర్టు ద్వారా విశాకఇండస్ట్రీస్‌‌‌‌కు వచ్చే నిధులను కూడా తిరిగి క్రికెట్ అభివృద్ధి కోసమే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసమే ఖర్చు చేస్తామని ప్రకటించారు. 

హెచ్‌‌‌‌సీఏ కోసం రూ.9 కోట్లు వదులుకున్నం

ఆర్బిట్రేషన్ ద్వారా విశాకఇండస్ట్రీస్‌‌‌‌కు దాదాపు రూ.26 కోట్ల పరిహారం లభించిందని, కానీ హెచ్‌‌‌‌సీఏ ప్రతినిధి అర్షద్ అయూబ్ తమను సంప్రదించి ఆ మొత్తాన్ని తగ్గించాలని కోరారని వివేక్ తెలిపారు. హెచ్‌‌‌‌సీఏ క్రీడా సంస్థ కాబట్టి దాని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రూ.17 కోట్లకు తాము అంగీకరించామని, ఇరుపక్షాలు కలిసి కోర్టులో జాయింట్ మెమో కూడా దాఖలు చేశామని వెల్లడించారు. కానీ హెచ్‌‌‌‌సీఏ ఆ ఒప్పందాన్ని కూడా సరిగ్గా అమలు చేయకపోవడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చిందని చెప్పారు. 

ప్రస్తుతం ఆ పరిహార నిధులు ఇంకా విశాకఇండస్ట్రీస్‌‌‌‌కు చేరలేదని, అవి కోర్టు పరిధిలోనే డిపాజిట్ అయి ఉన్నాయని స్పష్టం చేశారు. నిధులు లూటీ అయ్యాయంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, ఇప్పటివరకు విశాకఇండస్ట్రీస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. సీబీసీఐడీ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతోందని, రికార్డుల ప్రకారం వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు.