- రెండేండ్ల చిన్నారిని దారుణంగా కొట్టడంతో మృతి
- మంచంపై నుంచి పడి చనిపోయాడని భర్తను నమ్మించే ప్రయత్నం
- చిన్నారి తండ్రి విషయం పసిగట్టడంతో చివరికి కటకటాల పాలు
- కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన
కీసర, వెలుగు: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కన్న కుమారుడిని ఓ కసాయి తల్లి కడతేర్చింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని తన రెండేళ్ల కొడుకుని హతమార్చింది. అనారోగ్య సమస్యలతో చనిపోయాడని భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది. చిన్నారి తండ్రి విషయం పసిగట్టడంతో చివరికి కటకటాల పాలైంది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుళ్ల గ్రామానికి చెందిన స్వామి, జ్యోతి దంపతులు.. కీసర మండలంలోని చీర్యాల హిడెన్ గార్డెన్ సమీపంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
జ్యోతి అత్తగారి ఊరైన తీగుళ్లకే చెందిన నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. మే 29న మధ్యాహ్నం భర్త స్వామి ఇంట్లో లేని సమయంలో ప్రియుడు నవీన్.. జ్యోతి ఇంటికి వచ్చాడు. సాధారణంగా ప్రతిరోజూ పిల్లలను ఎదురింట్లోకి ఆడుకోవడానికి పంపించే జ్యోతి, ఆ రోజు మాత్రం రెండేండ్ల బాబు ఇంట్లోనే పడుకోవడంతో రూమ్‌లోనే ఉంచేసింది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో బాబు అకస్మాత్తుగా లేచి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఎంత బుజ్జగించినా బాబు నిద్రపోకపోవడంతో, జ్యోతి ఆవేశంతో పసికందుపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఆ దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
మంచంపై నుంచి పడ్డాడంటూ డ్రామాలు..
బాబు చనిపోయాడని గ్రహించిన జ్యోతి.. ప్రియుడు నవీన్‌తో కలిసి సాయంత్రం వేళ చీర్యాల క్రాస్ రోడ్డులోని ట్రామా కేర్ ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే బాబు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. దాంతో భయపడిపోయిన జ్యోతి.. ప్రియుడిని అక్కడి నుంచి పంపించేసి, మృతదేహంతో ఒంటరిగా ఇంటికి వచ్చింది. అనంతరం భర్త స్వామికి ఫోన్ చేసి.. బాబు ఆడుకుంటూ బెడ్ పైనుంచి కిందపడి చనిపోయాడంటూ కన్నీరుమున్నీరైంది. భార్య మాటలు నమ్మిన భర్త వెంటనే ఊరికి చేరుకున్నాడు. అది సాధారణ మరణమే అనుకుని, తమ స్వగ్రామమైన తీగుళ్లలో బాబు అంత్యక్రియలు పూర్తి చేశారు.
