జర్మన్ భాష నేర్చుకోండి..ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది: మంత్రి వివేక్ వెంకటస్వామి

జర్మన్ భాష నేర్చుకోండి..ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది: మంత్రి వివేక్ వెంకటస్వామి

నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా  మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి ఇల్లందు క్లబ్‌లో... జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.

టామ్ కాం (TOMCOM) సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి. చంద్రయ్య, మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, టామ్ కాం జీఎం నాగ భారతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్మన్ లాంగ్వేజ్ కోర్సు పూర్తి చేసుకుని, ఉత్తీర్ణులైన యువతీ యువకులకు మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. హైదరాబాద్ తరహాలోనే చెన్నూరు నియోజకవర్గం మందమర్రిలో ఈ సెంటర్ ఏర్పాటు చేయడంపై స్థానిక యువత మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... టామ్ కాం సంస్థను సద్వినియోగం చేసుకుంటే నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలని... పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని యువతకు పిలుపునిచ్చారు. ఇటీవల జర్మనీ సీఎం ఆధ్వర్యంలో 60 మంది బిజినెస్ బృందం మన తెలంగాణకు వచ్చిందని గుర్తుచేశారు. జర్మనీలో యువత జనాభా తక్కువగా ఉండటం వల్ల... అక్కడ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే ఆ దేశాలు మన దేశ యువత వైపు చూస్తున్నాయని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 120 ఏటీసీ (ATC)ల ద్వారా ఏటా 25 వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామని మంత్రి వివరించారు. జర్మనీలో ప్రతి ఏటా 5 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని... మన దేశం కోసం ఏడాదికి 90 వేల వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం ముందుకు వచ్చిందని ప్రకటించారు. టామ్ కాం ద్వారా కేవలం నాలుగు నెలల్లోనే జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తామని... నిరుద్యోగులు ఎవరూ ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల మాయలో పడి మోసపోవద్దని సూచించారు.

భారతీయుల కష్టపడే తత్వానికి విదేశాల్లో మంచి గుర్తింపు ఉందన్న మంత్రి... జర్మనీ వీసాలో 50 శాతం సబ్సిడీ కూడా లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, ఏటీసీలో శిక్షణ పొందే నిరుద్యోగులకు 80 శాతం అటెండెన్స్ ఉంటే... ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయల స్కాలర్‌షిప్ ఇస్తామని, దానికి తోడు కాక వెంకటస్వామి ట్రస్ట్ నుంచి అదనంగా నెలకు వెయ్యి రూపాయల స్టైఫండ్ అందిస్తామని మంత్రి బంపర్ ఆఫర్ ప్రకటించారు.

ALSO READ : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది..

యువతను ప్రోత్సహించేందుకు స్వయంగా తాను కూడా జర్మన్ క్లాసెస్ వింటానని వ్యాఖ్యానించారు. సింగరేణి సంస్థ సౌజన్యంతో చెన్నూరు నియోజకవర్గంలో త్వరలోనే ఒక నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.