
గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే అంజన్ కుమార్ యాదవ్ సేవలు అవసరమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి అక్టోబర్ 10న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నంతో కలిసి వెళ్లారు. ఆయనను బుజ్జగించారు. రానున్న రోజుల్లో పార్టీ నుంచి మరిన్ని అవకాశాలు వస్తాయని సర్దిచెప్పారు.
రెండుసార్లు ఎంపీగా గెలిచిన అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్ రాలేదని బాధపడ్డారని చెప్పారు మంత్రి వివేక్. మీనాక్షి నటరాజన్ అంజన్ కుమార్ కు పరిస్థితులు వివరించారని చెప్పారు. అంజన్ కుమార్ యాదవ్ ను పార్టీ గుర్తించి సరైన విలువ ఇస్తుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యం అని అంజన్ కుమార్ యాదవ్ చెప్పారన్నారు.
కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ నవీన్ కుమార్ యాదవ్ కు ఏఐసీసీ కేటాయించిన సంగతి తెలిసిందే. అంజన్ కుమార్ యాదవ్ తో పాటు, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ వస్తుందని ఆశపడ్డారు. చివరికి కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్ పేరు ఖరారు చేయడంతో అంజన్ కుమార్,సీఎన్ రెడ్డి కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇవాళ ఏఐసీసీ తెలంగాణ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ,మంత్రులు వివేక్, పొన్నం ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు.
నవంబర్ 11న జూబ్లీహిల్స్ బైపోల్ కు పోలింగ్ జరగనుంది. 14న కౌంటింగ్ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తుండగా.. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేయలేదు.