- కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ లీడర్.. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతుండు
- చెన్నూరులో రోడ్డు విస్తరణతోఎవరికి నష్టం జరగకుండా ఆదుకుంటామని వెల్లడి
కోల్‌బెల్ట్/ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలు చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మండుతున్న ఎండలు, పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో హమాలీల కొరత ఏర్పడిందని, అయినా మంచిర్యాల జిల్లాలో రోజుకు 150 లారీల ధాన్నాన్ని తరలిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని తెలిపారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి రైస్ మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా గోదాములను అద్దెకు తీసుకుని నిల్వ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని, రైతులెవరు ఆందోళన చెందవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకే రాష్ట్రాలు ధాన్యం కొంటాయని, కానీ రాష్ట్రంలో మాత్రం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారు పండించిన ధాన్యాన్నంతా ప్రోక్యూర్ చేస్తున్నామని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో గడువు పూర్తయినా తర్వాత కూడా 15 రోజుల పాటు కాటన్ కొనుగోళ్లు చేశామని, ఇందుకోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రం నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారని గుర్తుచేశారు. కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ లీడరని, అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌తో ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. రైతు సమస్యలపై కేటీఆర్‌కు అవగాహన లేదని, తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు తమ ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని, తాము అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలు జరగలేదని తెలిపారు. మరోవైపు, చెన్నూరులో రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వారికి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపులు కేటాయిస్తామని, స్థలం కోల్పోయిన వారికి టీడీఆర్ అందిస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. చెన్నూరు మున్సిపాలిటీ రూపురేఖలు మార్చడానికి అందరు సహకరించాలన్నారు. వ్యాపారులు
స్వచ్ఛందంగా రోడ్డు విస్తరణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అక్రమంగా రోడ్డు విస్తరణ పనులు చేశారని, బాధితులకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. మరోవైపు, చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై మంత్రి వివేక్ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్ పర్సన్ వినయ్ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మన దగ్గర పని గంటలు పెరగాలి..
ప్రపంచ దేశాలు కష్ట పడుతున్నట్లే మన దగ్గర కూడా పనిగంటలు పెరగాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో ప్రజలందరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ జీఐఎస్‌లో జరిగిన అంబేద్కర్ 135 జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని, అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జీఎస్ఐ సోథెర్న్ రీజియన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో జీఎస్ఐ సేవలు చాలా బాగున్నాయని కొనియాడారు.
సమాజంలో జీఎస్ఐ సేవల పునరుద్ధరణ కోసం ఏటా రూ.1,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టడానికి అధికారులు మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమాజ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం, వారు అన్ని రంగాల్లో రాణించేలా రిజర్వేషన్ అవకాశం కల్పించేలా అంబేద్కర్ చర్యలు తీసుకున్నారన్నారు. తన సతీమణి సైతం సమాజంలో మహిళల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అంబేద్కర్ కాలేజీలను ఆమె నిర్వహిస్తున్నారని చెప్పారు. నిరుపేదల కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యను అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం మా నాన్న గడ్డం వెంకటస్వామి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ఆయన ప్రజలకు సేవలందించారని, ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. మా నాన్న స్ఫూర్తితో 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానని తెలిపారు.
