టెక్నాలజీనే కాదు..హ్యుమానిటీ ముఖ్యమే.. మంత్రి వివేక్ వెంకటస్వామి

టెక్నాలజీనే కాదు..హ్యుమానిటీ ముఖ్యమే.. మంత్రి వివేక్ వెంకటస్వామి
  • విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • న్యాయ రంగంలో పరిస్థితులకు అనుగుణంగా స్టూడెంట్లు అప్‌‌డేట్ అవ్వాలని సూచన 
  • నేర్చుకుంటూ ఉంటేనే ఈ వృత్తిలో ముందుంటారు
  • కోర్టుల్లో ప్రజంటేషన్‌‌ స్కిల్సే విజయానికి కారణం అవుతాయి 
  • అంబేద్కర్ లా కాలేజీలో విధ్వత–2025 ఫెస్ట్​కు మంత్రి హాజరు​

ముషీరాబాద్, వెలుగు: జీవితంలో టెక్నాలజీని ఎంత అడాప్ట్‌‌ చేసుకున్నా.. మనిషికి హ్యుమానిటీ అనేది చాలా ముఖ్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్‌‌లోని బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో నాలుగు రోజుల పాటు జరగనున్న విధ్వత –2025 లా ఫెస్టివల్‌‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఇనిస్టిట్యూట్ కరస్పాండెంట్ సరోజా వివేక్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ డి.నాగార్జునతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్‌‌ మాట్లాడుతూ.. న్యాయరంగంలో పరిస్థితులు మారిపోయాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము మల్చుకోవాలని సూచించారు. ఎప్పుడూ నేర్చుకునే న్యాయవాదులే వృత్తిలో ముందుంటారని చెప్పారు. న్యాయరంగంలో టెక్నాలజీ పెరగడంతో లా టెర్మినాలజీ సులభంగా అర్థమవుతోందన్నారు. లా స్టూడెంట్స్ ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవాలని, కోర్టులో జడ్జిని ఎలా ఒప్పిస్తారో.. ఎలా వాదిస్తారో.. అదే విజయానికి 70 శాతం కారణం అవుతుందని చెప్పారు. 

నేడు ప్రతి రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా మల్టీ స్కిల్స్‌‌ నేర్చుకుంటేనే పలు రకాల పనులు చేయగలిగే సామర్థ్యం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టపడి, నిజాయితీగా పనిచేయడం వల్లే జస్టిస్ నాగార్జున హైకోర్టు న్యాయమూర్తి వరకు ఎదిగారని, మన జీవితంలో కూడా సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని పేర్కొన్నారు. 

టెక్నాలజీని అందిపుచ్చుకోండి: బాలకిష్టారెడ్డి

లా చదివే విద్యార్థులు క్లాస్ రూమ్‌‌‌‌లకే పరిమితం కాకుండా నూతన సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే విజయాలు సాధిస్తారని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. ప్రస్తుతం లా కోర్సుకు బాగా డిమాండ్ ఉందని, అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. అయితే, చదువుతో పాటు అవసరమైన స్కిల్స్ కూడా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ డీన్ వెంకటేశ్వర్లు, నాగార్జున, డాక్టర్ బీఆర్‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ జాయింట్ సెక్రటరీరమణ కుమార్, సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్ విష్ణుప్రియ, ప్రిన్సిపాల్ సృజన, వైస్ ప్రిన్సిపాల్ పద్మజతో పాటు ఫ్యాకల్టీ, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఫెస్ట్‌‌‌‌లో భాగంగా స్టూడెంట్స్‌‌‌‌కు న్యాయ అవగాహన, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతపై చైతన్యం పెంచే కార్యక్రమాలు, పోటీలు, సెమినార్లునిర్వహించనున్నారు. 

కనీస వేతనాల వ్యవస్థను సరి చేస్తున్నం.. 

దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విద్యార్థులను ఆహ్వానించి లా ఫెస్ట్ నిర్వహించడం మంచి విషమయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తన తండ్రి కాకా వెంకటస్వామి తక్కువగా చదువుకున్నారని, అయినా నిరాశ చెందకుండా ముందుకెళ్తూ పేదలకు విద్యను అందించి, అవకాశాలు కల్పించాలనే దృక్పథం ఆయనకు బలంగా ఉండేదన్నారు. అ స్ఫూర్తితోనే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం తమ బాధ్యతగా భావించామన్నారు. 

ఏ రంగంలోనైనా విజయం కావాలంటే నిజాయితీగా ఉంటూ కష్టపడి పని చేయాలని సూచించారు. అలాగే, రాష్ట్రంలో పదేండ్లుగా పెరగని కనీస వేతనాల వ్యవస్థను సరి చేస్తున్నామని చెప్పారు. కాకా కుటుంబానికి కార్మిక ఉద్యమ నేపథ్యం ఉందని, కార్మిక శాఖ మంత్రిగా కొత్త చట్టాల కోసం పనిచేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన రక్షణ ఉండేలా చట్టం రాబోతుందని చెప్పారు. సులభతర బిజినెస్ నినాదంతో చాలా చట్టాలు సవరించారని, కానీ, కొంతమంది పారిశ్రామిక వేత్తలు బాధ్యతగా వ్యవహరించడం లేదని, దీనికి సిగాజి ఫ్యాక్టరీ ఘటనే ఉదాహరణ అని అన్నారు.