లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ కనిపించదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ కనిపించదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీ కనిపించదు: వివేక్ వెంకటస్వామి 
  •     కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ముఖాల్లో ఓటమి ఫ్రస్ట్రేషన్ 
  •     జూబ్లీహిల్స్ స్ఫూర్తితో ఎక్కువ మున్సిపాలిటీలు గెలుస్తాం
  •     సంగారెడ్డి జిల్లా ముత్తంగి, జిన్నారం, తూప్రాన్​లో 
  • పార్టీ నాయకులతో మంత్రి సమావేశం

సంగారెడ్డి, వెలుగు: రాష్ట్ర ప్రజలను మోసగించి, అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం అయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న ఆ పార్టీ ముఖ్య నేతల ముఖాల్లో ఓటమి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ పరిస్థితి మునిగిపోయిన నావలాగా మారిందని, మనం ఒక దక్కా ఇస్తే.. ప్రజలు ఆ పార్టీని తరిమి కొడతారన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ముత్తంగి, జిన్నారం, తూప్రాన్లలో ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, తుఫ్రాన్ మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు, మిషన్ భగీరథ ద్వారా రూ.62 వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. 

జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిందని, ఆ పార్టీ వరుసగా ఓడిపోతున్నదని తెలిపారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు జరిగిన అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. జూబ్లీహిల్స్ స్ఫూర్తితో ఎక్కువ మున్సిపాలిటీల్లో గెలుస్తామని అన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి విస్తృత ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. బీఆర్ఎస్ మాదిరిగా వివాదాల జోలికి వెళ్లరాదని, ప్రజలను చైతన్యవంతులను చేసేలా సోషల్ మీడియాను వాడుకోవాలని క్యాడర్‌‌‌‌కు సూచించారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ కౌంటర్ ఇవ్వాలన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించి, వాటిని సక్రమంగా అమలయ్యేలా చూడాలని చెప్పారు. 

కేటీఆర్‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌ లీడర్‌‌‌‌..

కేటీఆర్ నేతృత్వంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని, ఆయన ఒక ఫెయిల్యూర్ లీడర్ అని మంత్రి వివేక్‌‌ విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బైపోల్‌‌లోనూ ఆ పార్టీ ఓడిపోవడం, పంచాయతీ ఎన్నికల్లోనూ కొద్ది స్థానాలకే ఆ పార్టీ మద్దతుదారులు పరిమితం కావడం ఇందుకు నిదర్శనమన్నారు. కేటీఆర్ సొంత కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేయించారని, ఆయన దిగజారి మాట్లాడడం సొంత పార్టీ నేతలకే నచ్చడం లేదన్నారు. కాగా, పటాన్‌‌చెరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల గురించి మంత్రికి బాధితులు వినతి పత్రాలు అందజేశారు. సీఎంతో మాట్లాడి, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రిని కాంగ్రెస్ ముఖ్య నాయకులు సన్మానించారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా రెడ్డి, కార్పొరేటర్ పుష్ప, మెదక్ కాంగ్రెస్ ఇన్‌‌చార్జ్ నీలం మధు, పటాన్‌‌చెరు నియోజకవర్గం పార్టీ ఇన్‌‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్, చంద్రారెడ్డి, శశికళ యాదవ రెడ్డి, జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు వడ్డె కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, శశిధర్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎలక్షన్ రెడ్డి, భూమిరెడ్డి, నాచారం దేవాలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, భాస్కర్ రెడ్డి, మామిండ్ల కృష్ణ, నందాల శ్రీనివాస్, నారాయణ గుప్తా, మామిడి వెంకటేష్, భగవాన్ రెడ్డి, దీపక్ రెడ్డి, సర్పంచ్‌‌ల ఫోరం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పెంటా గౌడ్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.