జర్మన్ భాష నేర్చుకుంటే  విదేశాల్లో బంపర్ ఆఫర్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

జర్మన్ భాష నేర్చుకుంటే  విదేశాల్లో బంపర్ ఆఫర్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •   క్రమశిక్షణ, నిరంతర సాధనతోనే లాంగ్వేజ్‌‌పై పట్టు: 
  • మంత్రి వివేక్ వెంకటస్వామి  టామ్‌‌ కామ్ విద్యార్థులతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: జర్మన్ భాషను నేర్చుకునే విద్యార్థులకు విదేశీ భాషల్లో బంపర్ ​ఆఫర్లు ఉంటాయని, క్రమశిక్షణ, నిరంతర సాధనతో ప్రతి ఒక్కరూ ముందుకుసాగాలని  మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. కొత్త భాషలపై పట్టు సాధించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో లభించే అద్భుతమైన ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సోమవారం టామ్‌‌కామ్ కార్యాలయంలో జర్మన్ భాషలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్మనీలో ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న యువత కోసం టామ్‌‌కామ్ ఆధ్వర్యంలో ఈ జర్మన్ భాషపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన దేశంలో నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ.. జర్మనీ వంటి దేశాల్లో పనిచేసేవారికి లభించే వేతనాలు మన కరెన్సీ విలువలో చాలా ఎక్కువగా ఉంటాయని వివరించారు. విదేశీ ఉద్యోగాలను అందుకోవడంలో భాషా ప్రావీణ్యమే ప్రధాన అడ్డంకిగా మారుతోందని, అందుకే విద్యార్థులు ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా హాజరవుతూ భాషపై పట్టు సాధించాలని మంత్రి సూచించారు. ఇటీవల మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రారంభించిన జర్మన్ భాషా తరగతులకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

విద్యార్థులు సమర్థవంతంగా భాషను నేర్చుకునేలా వారి అటెండెన్స్‌‌ను తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తాను కూడా నిరంతర సాధన, పట్టుదలతోనే తెలుగు భాషను నేర్చుకున్నానని ఈ సందర్భంగా మంత్రి తన అనుభవాన్ని పంచుకున్నారు. ఏ భాషనైనా నేర్చుకోవాలంటే నిరంతర అభ్యాసమే విజయానికి మూలమని పేర్కొన్నారు. ఇలాంటి క్వాలిటీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యువతకు మెరుగైన ఉపాధిని అందించడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్‌‌ ఫుల్ కెరీర్‌‌ను నిర్మించుకునేందుకు ఎంతో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

ముషీరాబాద్, వెలుగు: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, దీని కోసం ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బాధ్యత వహించాలని కోరారు. ప్రతి ఒక్కరిలో అవగాహన, ఆలోచనలో మార్పు వచ్చినప్పుడే బాల కార్మిక వ్యవస్థ అంతమవుతుందని పేర్కొన్నారు. చిన్నారుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడడం అందరి బాధ్యత అని అన్నారు.

సోమవారం హైదరాబాద్‌‌‌‌ బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చిన్నపిల్లలను పనిలోకి పంపకుండా బడికి పంపే విధంగా తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్మిక శాఖ అధికారులు బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సామాజికవేత్త చైల్డ్ రైట్స్ శాంతా సిన్హా మాట్లాడుతూ, తెలంగాణలో లేబర్ డిపార్ట్‌‌మెంట్ మూడు దశాబ్దాలుగా చైల్డ్ రైట్స్ కోసం బాల కార్మికుల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని చైల్డ్‌‌ లేబర్ ఫ్రీ స్టేట్‌‌గా చేయాలని కోరారు. ఈ సదస్సులో ఎమ్మెల్యేలు జి.వినోద్, నవీన్ యాదవ్, కార్మిక శాఖ కమిషనర్ హరిచందన, లేబర్ కమిషనర్ గంగాధర్, డిప్యూటీ లేబర్ కమిషనర్ జాన్సన్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.