ఏటీసీ సెంటర్లలో.. ఏఐ, స్కిల్ డెవ్లప్మెంట్ కోర్సులు ప్రారంభించాలి

ఏటీసీ సెంటర్లలో.. ఏఐ, స్కిల్ డెవ్లప్మెంట్  కోర్సులు ప్రారంభించాలి

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో (ATC)  ఏఐ ఆధారిత కోర్సులు సహా కొత్త నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రారంభించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. యువత ఉపాధి అవకాశాలు పెంచేలా అన్ని కొత్త కోర్సులు.. ప్రస్తుతంతో పాటు భవిష్యత్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.   నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సచివాలయంలో  కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీలు , ఈఎస్ఐ శాఖల అధికారులతో సమావేశమై, వారి పనితీరు, సేవలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శాఖల వారిగా సమీక్షించిన మంత్రి, రాబోయే ఏడాదికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. 

కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన వివేక్ వెంకటస్వామి, పరిశ్రమల ప్రమాదాలను నివారించేందుకు ఫ్యాక్టరీల శాఖ భద్రతా ప్రమాణాలు, సన్నద్ధతను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. సిగాచీ ఘటన వంటి సంఘటనలను ప్రస్తావిస్తూ, కార్మికుల భద్రత, సంక్షేమంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టంచేశారు.  అదేవిధంగా ఈఎస్ఐ శాఖ పనితీరును కూడా సమీక్షించిన మంత్రి, ఇన్స్యూర్డ్ పర్సన్స్‌ (IPs) కు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐపీల నుంచి ఫిర్యాదులు రావడం సహించబోమని, అవసరమైన చోట అదనపు డిస్పెన్సరీలు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సేవలను మెరుగుపరచాలని సూచించారు.

నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ శాఖల అధికారులు సచివాలయంలోని మంత్రిని కలిశారు. మంత్రి శుభాకాంక్షలను స్వీకరిస్తూ, అధిక బాధ్యత, నిబద్ధత తో పనిచేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.