సహస్రను చంపింది పక్కింటి బాలుడే ..వీడిన కూకట్‌‌పల్లి బాలిక మర్డర్ మిస్టరీ

సహస్రను చంపింది పక్కింటి బాలుడే ..వీడిన కూకట్‌‌పల్లి బాలిక మర్డర్ మిస్టరీ

 

  •     నిందితుడు టెన్త్ క్లాస్‌‌ స్టూడెంట్
  •     వెబ్​సిరీస్‌‌లు, క్రైమ్​మూవీలు​చూసి చోరీకి స్కెచ్​
  •     ఎలా చేయాలనేది నోట్‌‌బుక్‌‌లో రాసుకుని అమలు
  •     దొంగతనానికి వెళ్లినప్పుడు సహస్ర చూడడంతో మర్డర్ 
  •     రక్తపు బట్టలు చూసినా సైలెన్స్‌‌గా ఉన్న బాలుడి పేరెంట్స్
  •     పోలీసుల అదుపులో నిందితుడు, అతని తల్లిదండ్రులు 

కూకట్‌‌పల్లి, వెలుగు: హైదరాబాద్‌‌లో సంచలనం సృష్టించిన కూకట్‌‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమెను పక్కింట్లో ఉండే పదో తరగతి బాలుడే హత్య చేసినట్టు తేలింది. చోరీ చేయడం కోసం సహస్ర ఇంటికి వెళ్లిన నిందితుడు.. తనను చూసిందనే కారణంతో ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దొంగతనం ఎలా చేయాలి? తర్వాత ఎలా ఇంటికి తిరిగి రావాలి? అని నిందితుడు ముందే ఓ పేపర్‌‌‌‌పై రాసుకున్నాడు. దొంగతనం చేసి వచ్చేప్పుడు ఆ ఇంట్లో గ్యాస్​ ఆన్​చేసి రావాలని అనుకున్నాడు.  దీనివల్ల ఫైర్​యాక్సిడెంట్​జరిగి అంతా కాలిపోతుందని భావించాడు. పైగా హత్య జరిగిన రోజు అంగీపై రక్తపు మరకలు పడగా, వాటిని చూసిన నిందితుడి తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడలేదు. దీంతో విషయం బయటపడలేదు. విచారణలో భాగంగా పోలీసులు సహస్ర ఇంటికి వచ్చి వెళ్తున్నా సదరు బాలుడిపై ఏ మాత్రం అనుమానం రాలేదు. సీసీ కెమెరాల్లోనూ బయటి వాళ్లు వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడంతో ఆ బిల్డింగులో ఉంటున్నవారి చుట్టూనే ఇన్వెస్టిగేషన్​నడిచింది. చివరకు ఆ బిల్డింగు చుట్టుపక్కల వారిని విచారిస్తుండగా బాలుడు మాట్లాడిన ఒక్క మాట అతడిపై అనుమానం కలిగేలా చేసింది. పోలీసులు తమదైన పద్ధతిలో విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించనప్పటికీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 

ఆ ఒక్క మాటతో అనుమానం.. 

కూకట్‌‌పల్లి దయార్‌‌‌‌గూడలోని బిల్డింగ్‌‌ పెంట్‌‌హౌస్‌‌లో ఈ నెల18న మధ్యాహ్నం సహస్ర దారుణ హత్యకు గురైంది. ఆమె ఒంటి మీద దాదాపు 20 కత్తిపోట్లు ఉండడంతో ఎవరో కావాలనే పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తూ వచ్చారు. సహస్ర పేరెంట్స్‌‌కి ఎవరైనా శత్రువులున్నారా? ఎవరితోనైనా గొడవలు, పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలోనే దర్యాప్తు చేస్తూ వచ్చారు. దీంతో అసలు నిందితుడు కళ్ల ముందే తిరుగుతున్నా గుర్తించలేకపోయారు. అయితే ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా ఫలితం లేకపోవడం, బిల్డింగ్‌‌లోకి ఎవరూ వచ్చి వెళ్లిన దాఖాలాలు లేకపోవడంతో పోలీసులు చుట్టపక్కల వారిని విచారించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సహస్ర ఉంటున్న బిల్డింగ్‌‌ పక్కన ఉన్న భవనంలో పదో తరగతి చదివే బాలుడిని విచారించారు. ‘బాబు.. 18న జరిగిన సహస్ర హత్య గురించి నీకేమైనా తెలుసా?’అని పోలీసులు ప్రశ్నించగా.. ‘అంకుల్​సహస్ర నాకు తెలుసు. చాలామంచిది. ఆ రోజు నేను ఇంట్లనే ఉన్నాను. ‘డాడీ..డాడీ..డాడీ’అని సహస్ర పిలిచినట్టు అరుపులు వినిపించినయ్’అని చెప్పాడు. దీంతో ఆ కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేయగా.. చుట్టుపక్కల వారెవరూ తమకు అలాంటి అరుపులు వినిపించలేదని సమాధానం చెప్పారు. దీంతో అతనొక్కడికే అరుపులు వినిపించడం ఏమిటి? అన్న అనుమానం పోలీసులకు కలిగింది. మరోవైపు సహస్ర ఇంటికి దూరంగా ఓ ఇంట్లో ఉంటున్న ఓ సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌ను పోలీసులు విచారించిన క్రమంలో.. ఆ రోజు బాలుడు సహస్ర ఇంటి దగ్గర కనిపించాడని చెప్పాడు. దీంతో అనుమానం మరింత బలపడింది.

చోరీ విషయం బయటకు చెప్తుందనే మర్డర్.. 

నిందితుడు రోజూ ఓటీటీల్లో క్రైమ్​వెబ్​సిరీస్‌‌లు చూసేవాడు. ముఖ్యంగా దోపిడీలు, దొంగతనాలకు సంబంధించిన క్రైమ్​సిరీస్‌‌లను విడిచిపెట్టేవాడు కాదు. ఈ క్రమంలోనే అతడికి సినిమాల్లో చూపించినట్టు దొంగతనం చేయాలనే ఆలోచిన వచ్చింది. బాలుడి కుటుంబం పెంట్‌‌హౌస్‌‌లో ఉంటుండగా, ఆ పక్క బిల్డింగ్‌‌లోని పెంట్‌‌హౌస్‌‌లో సహస్ర కుటుంబం ఉంటున్నది. ఈ క్రమంలో తన చోరీ ప్లాన్‌‌ అమలు చేసేందుకు సహస్ర ఇంటిని బాలుడు ఎంచుకున్నాడు. చోరీ చేశాక ఎలా తప్పించుకోవాలో ప్లాన్​వేసుకున్నాడు. చోరీ ఎలా చెయ్యాలి? చేశాక ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి అన్నది తన నోట్‌‌బుక్‌‌లో ఇంగ్లీషులో రాసుకున్నాడు. ‘‘కత్తితో లాక్​కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించాలి? గ్యాస్​సిలిండర్‌‌‌‌ను టేబుల్​వద్దకు జరపాలి.. తర్వాత క్యాష్​తీసుకోవాలి..గ్యాస్​సిలిండర్‌‌‌‌ పేలిపోయేలా దాన్ని లీక్ చూసి మళ్లీ డోర్​లాక్​చేసి తప్పించుకోవాలి’’అని అందులో రాసుకున్నాడు. ఈ నోట్‌‌లో చోరీ ఎలా చేయాలన్నది మాత్రమే ఉంది. ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలో అందులో రాసుకోలేదు. దీన్నిబట్టి అతడికి హత్య చేయాలన్న ప్లాన్​లేదని, హఠాత్తుగా సహస్రను చూశాక బయటకు చెప్తుందేమోనని మర్డర్‌‌‌‌కు తెగించాడని తెలుస్తున్నది. 

బ్యాట్ ఇవ్వలేదనే కోపంతోనూ.. 

సహస్ర కుటుంబంతో నిందితుడి కుటుంబ సభ్యులు కలివిడిగానే ఉండేవారు. గతేడాది సహస్ర బర్త్​డే వేడుకలకి తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన నిందితుడు.. ఆ రోజు సహస్రకి కేక్​ తినిపించాడు. సహస్ర తమ్ముడితోనూ నిందితుడు స్నేహంగానే ఉండేవాడు. ఈ క్రమంలో సహస్ర తమ్ముడితో కలిసి క్రికెట్​ఆడుతుండేవాడు. సహస్ర తమ్ముడి దగ్గర ఎంఆర్ఎఫ్​ బ్యాట్​ఉంది. అది తనకు కూడా కావాలని తరచూ అడిగేవాడు. ఒక్కోసారి ఇవ్వకపోవడంతో కోపం పెంచుకుని, వాళ్ల ఇంట్లోనే చోరీ చేసి ఆ డబ్బులతో బ్యాట్ ​కొనాలని నిర్ణయించుకున్నాడు. చోరీ చేయడానికి కృష్ణ ఇంటిని ఎంచుకోవడానికి దీన్ని కూడా కారణంగా చెప్తున్నారు.

బిల్డింగ్ పైనుంచి దూకి వెళ్లి.. 

బాలుడిపై అనుమానం రావడంతో ముందు అతడి గురించి తెలుసుకోవాలని పోలీసులు భావించారు. అక్కడి గల్లీతో పాటు చుట్టుపక్కల ఆరా తీస్తే.. కొంచం ర్యాష్, అగ్రెసివ్‌‌గా ఉంటాడని, రూడ్‌‌గా బిహేవ్ చేస్తాడని చెప్పారు. బిల్డింగులు ఎక్కి దూకుతాడని మరికొందరు చెప్పారు. అప్పుడే పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది. బయటి నుంచి ఎవరూ రాలేదని సీసీ కెమెరాల్లో తేలినప్పుడు.. బిల్డింగ్‌‌ దూకి వచ్చే అవకాశం ఉంటుంది కదా? అని అనుకున్నారు. దీంతో ఆ బాలుడిపై అనుమానం ఎక్కువైంది. కానీ బలపరిచే ఆధారాలు లేకపోవడంతో అతడిని విచారించాలనుకున్నారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తనకు ఏమీ తెలియదని, పదో తరగతి చదివే తాను అలా ఎలా చేస్తానని మాట్లాడి పోలీసులకు బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే తల్లిదండ్రులను కూడా పిలిచి విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. దీంతో బాలుడి ఇంటిని సోదా చేసిన పోలీసులు.. హత్య చేసిన రోజు అతడు వేసుకున్న దుస్తులు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు అతని తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

ఎలా చేశాడంటే..

బాలుడు ‘ఆమ్​స్టర్’అనే ఒక రకమైన ఎలుకను పెంచుకుంటున్నాడు. ఆ ఎలుకకు ఫుడ్​పెట్టటం కోసం ఉపయోగించే చిన్న కత్తి తనతో తీసుకువెళ్లాడు. ఉదయం 11 గంటలకు తమ బిల్డింగ్​నుంచి పక్క బిల్డింగ్​పైకి జంప్​చేసి సహస్ర ఇంట్లోకి ప్రవేశించాడు. తర్వాత మెల్లిగా డోర్​తెరిచి లోపలకు వెళ్లాడు. అప్పటికే సహస్ర బెడ్​పై పడుకుని టీవీ చూస్తోంది. ఏదో చప్పుడు రావడంతో నిందితుడిని చూసింది. ఎందుకు ఇంట్లోకి వచ్చావని ప్రశ్నించింది. ‘మా అమ్మానాన్న వచ్చాక నీ గురించి చెప్తా..వెళ్లిపో’అని హెచ్చరించింది. దీంతో తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని ఆమె దగ్గరకు వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇష్టమున్నట్టు పొడిచాడు. మెడపై 15 పోట్లు, కడుపుపై ఐదు పోట్లు పొడిచాడు. తర్వాత తలుపుకు గొల్లెం పెట్టి మళ్లీ తన బిల్డింగుపైకి దూకి వెళ్లిపోయాడు.