- జియో ట్యాగింగ్ చేస్తున్నరు.. నెంబర్ ఇస్తున్నరు
- ఐదేండ్లకోసారి మైనర్ ఇరిగేషన్ సర్వే
- యాదాద్రిలో 7.63 శాతం లెక్కింపు
యాదాద్రి వెలుగు: బోర్లు, బావుల లెక్క మొదలైంది. వీటితో పాటు చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ లెక్కలు కూడా చేస్తున్నరు. వీటి లెక్కలను తేల్చడంతో పాటు యాప్‌లో నమోదు చేస్తూ జియో ట్యాగింగ్ చేయడంతో పాటు గుర్తించిన ప్రతీ నీటి వనరుకూ ఒక నెంబర్‌ను కేటాయిస్తున్నారు. పైగా పని చేయని నీటి వనరులకు కూడా కారణాలను వివరిస్తూ ఓ నెంబర్ కేటాయించాల్సి ఉంటుంది. అయితే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రత్యేకంగా ఓ కోడ్ నెంబర్ కేటాయిస్తారు.
ప్రతీ ఐదేండ్లకు ఒకసారి
చిన్న నీటి వనరులు అంటే బావులు, బోర్లు, చెరువులను రెవెన్యూ గ్రామాల్లో ప్రతి ఐదేండ్లకు ఒకసారి లెక్కిస్తారు. వీటితో పాట లిఫ్ట్ ద్వారా నీటి తరలింపును కూడా లెక్కిస్తారు. దేశవ్యాప్తంగా 1986-–87లో ప్రారంభమైన ఈ సర్వే.. 2017-–18 ఫైనాన్స్ ఇయర్‌ను బేస్ చేసుకొని 2019లో నిర్వహించిన ఆరోసారి సర్వే వరకూ మాన్యువల్‌గా జరిగింది. 2025-–26 ఫైనాన్స్ ఇయర్లో ఏడోసారి సాంకేతికంగా నిర్వహిస్తున్నారు.
ఎన్యుమరేటర్లుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈవో, పంచాయతీ నుంచి జీపీవో, డీఆర్డీఏ నుంచి టెక్నికల్ అసిస్టెంట్‌ను ఎంపిక చేశారు. సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లకు ట్రాన్స్పోర్ట్, సెల్‌ఫోన్ నిర్వహణ కోసం ప్రతి నెల రూ. 1900 చొప్పున చెల్లిస్తున్నారు.
బావులు, బోర్ల లెక్కింపు షురూ
గతేడాదిలో వీటిలో కేవలం చెరువులకు సంబంధించిన లెక్కల కోసం యాదాద్రి జిల్లాను పైలట్‌గా ఎంచుకున్నారు. జిల్లాలోని 320 రెవెన్యూ గ్రామాల్లోని చెరువులను ఎంపీఎస్వో (మండల గణాంక ఆఫీసర్)లు లెక్కించారు. అయితే ఆ ఏడాది చివర్లోనే చెరువులు, కుంటలతో పాటు బోర్లు, బావులు, లిఫ్ట్‌లు లెక్కించాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా వీటిని లెక్కించే ప్రక్రియ మొదలైంది. దీనికోసం నీటి వనరుల వద్దకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తోంది.
చెరువులు, కుంటలు బావులు, బోర్ల నీటిని వ్యవసాయం కోసమతే.. సీజన్ల వారీగా ఏఏ పంటలు పండిస్తున్నారో కూడా నమోదు చేస్తున్నారు. చేపల పెంపకానికి చెరువులు ఉపయోగిస్తే అవే వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే బోర్లకు సంబంధించి భూగర్భ జలమట్టాల ఆధారంగా లెక్కిస్తారు. ఈ సర్వేలో చెరువులు, బోర్లు, బావుల తవ్వకం ఎప్పుడు జరిగింది. వాటి విలువతో పాటు అవి ఉన్న సర్వే నెంబర్, బై నెంబర్లు, ఖాళీ ప్లాట్లలో ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్లు పేర్కొంటూ ఓనర్ల పేర్లు కూడా నమోదు చేస్తున్నారు.
చెరువులకు వాడుకలో ఉన్నపేర్లతో పాటు ఉపయోగంలో ఉన్న వనరుల కారణంగా ఎన్ని ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలో పేర్కొనాల్సి ఉంటుంది. వాటి ఉపయోగం తక్కువగా ఉన్నట్టయితే నిధుల లేమి వివరాలతో పాటు ఇతరత్రా కారణాలను పేర్కొంటున్నామని సీపీవో వెంకట రమణ తెలిపారు.
7.63 శాతం పూర్తి
యాదాద్రి జిల్లాలో 7109 బావులు, 53,908 బోర్లు ఉన్నాయి. చెరువులు, కుంటలు, లిఫ్ట్స్ కలిపి 4975 ఉన్నాయి. వీటిలో బావులు, బోర్లు కలిపి 3265 , చెరువులు ఇతరత్రా కలిపి 1773 గుర్తించి, నెంబర్లు కేటాయించారు. మొత్తంగా ఇప్పటివరకూ 5038 (7.63 శాతం)వనరులను గుర్తించి, నెంబర్లను కేటాయించారు. ఈ నెలలోనే పూర్తి స్థాయిలో సర్వే ముగించడాని ప్రణాళిక డిపార్ట్మెంట్ ముందుకు సాగుతోంది.
నీటి వనరులకు ప్రత్యేక కోడ్
ప్రతీ రెవెన్యూ గ్రామంలోని నీటి వనరుల ఫొటోలు క్యాప్చర్ చేస్తూ జియో ట్యాగింగ్ చేస్తున్నారు. దీంతో పాటు మొదటి నీటి వనరుకు 001 నుంచి కోడ్ నెంబర్ కేటాయిస్తున్నారు. ఈ నెంబర్‌కు మరో 18 అంకెలు కలిపి అంటే గ్రామం, వార్డు, పట్టణం, బ్లాక్, జిల్లా, రాష్ట్రం వీటికి కేటాయించిన నెంబర్లతో కలిపి 21 అంకెలు గల ప్రత్యేక నెంబర్‌ను కేటాయిస్తున్నారు.
ఒక్కో ప్రాంతంలోని నీటి వనరులకు 1 నుంచి 4 వరకూ ప్రత్యేకంగా కోడ్ ఇస్తున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని నీటి వనరులకు మాత్రం ప్రత్యేకంగా కోడ్ -5గా ఇవ్వాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఉపయోగంలో లేని నీటి వనరులు ఏ కారణంతో ఉపయోగం లేకుండా పోయాయో వివరాలు పేర్కొంటూ నెంబర్లు కేటాయిస్తున్నారు.
