రూ.50 వేలు తీసుకో.. పాస్‌ పుస్తకాలిచ్చెయ్ 

రూ.50 వేలు తీసుకో.. పాస్‌ పుస్తకాలిచ్చెయ్ 

రెవెన్యూ కార్యదర్శిపై ఎమ్మెల్మే ఆగ్రహం

ఈ 50 వేల రూపాయలు తీసుకో.. రైతులను ఇబ్బంది పెట్టకుంట ఇయ్యాల్సిన భూమి పట్టా పాసుపుస్తకాలు వాళ్లకు ఇచ్చేయ్… అంటూ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు రెవెన్యూ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి పట్టా పుస్తకాల జారీలో జాప్యం, రైతులు పడుతున్న అవస్థలను ఇది కళ్లకు కడుతోంది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామంలో మంగళవారం రెండు పడకల గదులను ఎమ్మెల్యే భాస్కర్​రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాసు పుస్తకాల పంపిణీ జాప్యంపై రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన గ్రామ రెవెన్యూ కార్యదర్శి కాశయ్యను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘రైతు పాస్‌పుస్తకం రైతుకు ఇవ్వకుంటే ఎట్లా. రైతులు ఆఫీస్‌ చుట్టూ తిరిగి తిరిగి ఇదై పోవాలా? నువ్వు ఊర్లనే ఉంటున్నావా? ఉండేది ఎక్కడ? నేను వచ్చానని వచ్చావా?… ప్రజల అవసరాలు తీర్చకపోతే నువ్వు,నేను ఇద్దరం దండగా.. పని చేయకపోతే ఇక్కడ అవసరం లేదు వేరే చోటకు వేళ్లాలానుకుంటే చెప్పు పంపిస్తా. రైతు సమస్యను పరిష్కరించకుంటే ఎమ్మెల్యే దేనికి అని నన్ను ప్రశ్నిస్తారు. ప్రజలకు విసుగొస్తే పని చేయనందుకు నిన్ను కొడతారు. చేయించకపోతే నన్ను కొడతారు. అందుకే నీకు దండం పెడతా రైతులకు పుస్తకాలు ఇచ్చేయ్‌’ అని అన్నారు. పది రోజులలో రైతులకు పాసు పుస్తకాలు అందించాలని, సమస్య ఉన్న వాటిని తన దృష్టికి , ఆర్డీవో దృష్టికి తీసుకురావాలన్నారు.