మీర్జాపూర్: ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 9 గంటల 15 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫోన్ మాట్లాడుకుంటూ రైలు వస్తున్న సంగతి గమనించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
యూపీలోని మీర్జాపూర్ చునార్ రైల్వే స్టేషన్ దగ్గర బుధవారం ఉదయం రైల్వే లైన్ దాటుతుండగా హౌరా-కల్కా మెయిల్ రైలు ఢీకొనడంతో ఆరుగురు భక్తులు మరణించారు. సోన్‌భద్ర నుంచి వస్తున్న గోమోహ్-ప్రయాగ్‌రాజ్ బార్వాడిహ్ ప్యాసింజర్ రైలు బుధవారం ఉదయం 9:15 గంటల ప్రాంతంలో నాలుగో నంబర్ ప్లాట్ ఫాం మీద ఉంది. ఆ రైలులో ఉన్న భక్తులు కార్తీక పూర్ణిమ స్నానం కోసం చునార్‌కు వచ్చారు.
నాలుగో నంబర్ ప్లాట్‌ఫారమ్ దగ్గర రైలు దిగిన తర్వాత.. వారు ఎదురుగా ఉన్న మూడో నంబర్ ప్లాట్ ఫామ్ మీదకు వెళ్లి అక్కడ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో.. రైలు పట్టాలు దాటుతుండగా వీరిని రైలు ఢీ కొట్టింది. మీర్జాపూర్‌లో జరిగిన ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.
