
మిస్ వరల్డ్ కంటెస్టంట్లు వరంగల్లో సందడి చేశారు. కంటెస్ట్ లో భాగంగా వివిధ దేశాలకు చెందిన సుందరాంగులు బుధవారం (మే 14) వరంగల్ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం వరంగల్ చేరుకున్న వరల్డ్ బ్యూటీలకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వరంగల్ హరిత హోటల్‌లో సందడి చేశారు వరల్డ్ బ్యూటీస్. హోటల్ ముందు బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలో..అని పాటలుపాడుతూ బతుకమ్మ ఆడారు.
ప్రపంచ సుందరీమణుల రాకతో వరంగల్ లో కోలాహలం మొదలైంది. హరిత హోటల్ దగ్గర మిస్ వరల్డ్ కంటెస్టంట్లకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు లావణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వారికి స్వాగతం పలికారు.అనంతరం 22 మంది సుందరీమణులు వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్ ను సందర్శించారు.
ఆ తర్వాత ములుగు జిల్లా రామ పాలయానికి ప్రపంచ సుందరిమణులు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర ఎస్పీ శబరిష జిల్లా అధికారులు టూరిజం శాఖ అధికారులు ప్రపంచ సుందరీమణులకు ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.