
- యాదగిరిగుట్ట, పోచంపల్లిలో పర్యటించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
- గుట్టలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు
యాదాద్రి/భూదాన్‌పోచంపల్లి/యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శిల్ప సౌందర్యం, నర్సన్న వైభవం, పోచంపల్లిలో ఇక్కత్ వస్త్రాల సోయగం చూసి అందాల భామలు మంత్రముగ్ధులయ్యారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గురువారం యాదగిరిగుట్టతో పాటు పోచంపల్లిలో సందడి చేశారు. యాదగిరిగుట్టకు వచ్చిన తొమ్మిది మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుని అఖండజ్యోతి వద్ద దీపారాధన చేశారు. బ్రహ్మోత్సవ మండపం వద్ద ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.
తర్వాత తూర్పు రాజగోపురం నుంచి త్రితల గోపురం మీదుగా ఆలయంలోకి వెళ్లారు. అక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకొని, గర్భాలయంలోకి వెళ్లి స్వయంభునారసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ మంటపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆఫీసర్లు మెమొంటోలు అందజేశారు. సప్తగోపుర ప్రధానాలయ సముదాయం, అష్టభుజి ప్రాకార మండపాలు, మాడవీధుల్లో ఆలయ ప్రాకారాలపై చెక్కబడిన శిల్పాలను తిలకించారు.
పోచంపల్లిలో ఆకట్టుకున్న ర్యాంప్ వాక్
భూదాన్‌పోచంపల్లికి వచ్చిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకుఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు స్వాగతం పలికారు. రుంజా వాయిద్యం, సంస్కృతి, సంప్రదాయ నాదస్వర, కోలాటాలతో స్థానికులు స్వాగతం చెప్పారు. అనంతరం పోచంపల్లి చీరల తయారీ, డిజైన్, అద్దకం, ఇక్కత్ వస్త్రాలను చూసి ఆశ్చర్యపోయారు. పోచంపల్లి చేనేత టూరిజం పార్క్ ప్రవేశ దారం వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఎంట్రెన్స్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడారు.
తర్వాత నూలు వడకడం, రాట్నం తిప్పడం, చేనేత వస్త్రాలు నేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ నిర్వహించారు. 25 దేశాలకు చెందిన మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లతో పాటు హైదరాబాద్, నల్గొండ, ఇతర జిల్లాలకు చెందిన మోడల్స్‌తో అరగంటకు పైగా నిర్వహించిన ర్యాంప్‌వాక్ ఆకట్టుకుంది. పోచంపల్లి విశిష్టతను ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు వివరించారు.
నేడు పిల్లలమర్రికి..
మహబూబ్‌నగర్, వెలుగు : మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు శుక్రవారం సాయంత్రం పిల్లలమర్రికి రానున్నారు. పర్యటనలో భాగంగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఊడలమర్రితో పాటు మ్యూజియంలో ఉన్న పురాతన శిల్పాలు, నాణేలు, 16వ శతాబ్దానికి చెందిన రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు.
మిస్ వరల్డ్ర్ కంటెస్టెంట్ల రాక సందర్భంగా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పిల్లల మర్రిలో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసి నారాయణపేట, గద్వాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన చీరలను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు వెదురుతో తయారు చేసిన వస్తువులు, పాలమూరు మహిళా సంఘాల ఆధ్వర్యంలో హస్త కళా నైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.
కార్యక్రమం చివర్లో గురుకుల స్టూడెంట్లతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మాట్లాడనున్నారు. సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకోనున్న కంటెస్టెంట్లు తిరిగి రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటన సందర్భంగా మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.