
- మతిస్థిమితం లేనట్లుగా ప్రవర్తిస్తుండటంతో
- రెస్క్యూ హోంకు తరలింపు
గచ్చిబౌలి, వెలుగు: పిల్లల చుట్టూ తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించిన ఓ మహిళను కిడ్నాపర్‌గా భావించిన స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మజీద్ బండ సమీపంలో నిర్మాణంలో ఉన్న అనసూయ హిల్స్ లేబర్ క్యాంప్ కు మంగళవారం ఉదయం 10 గంటలకు ఓ మహిళ వచ్చింది. అక్కడున్న పిల్లల చుట్టూ తిరుగుతూ.. చాలాసేపు వారి పక్కనే ఉంది. స్థానికులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా.. ఆమె సరైన సమాధానాలు చెప్పలేదు. దీంతో చిన్నారులను ఎత్తుకుపోయేందుకు వచ్చిందేమోనని తాడుతో కట్టేసి చితకబాదారు.
డయల్ 100కు కాల్చేసి పోలీసులకు అప్పగించారు. వారు ఆమెను ఠాణాకు తీసుకెళ్లి విచారించగా.. తన పేరు పూనమ్ అని, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు చెప్పింది. సరైన గుర్తింపు కార్డు లభించకపోవడం, మహిళా పోలీసులు ఆమెను సమీప ప్రాంతాలకు తీసుకెళ్లినా ఎక్కడ ఉండేది వెల్లడించలేదు. మతిస్థిమితం లేనట్లుగా ప్రవర్తిస్తుండటంతో రెస్క్యూ హోంకు తరలించారు. పూనమ్ తో ఇంకెవరైనా వచ్చారా తెలుసుకునేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.