ఉమెన్స్ క్రికెట్ : ఇండియాదే వన్డే సిరీస్‌‌

ఉమెన్స్ క్రికెట్ : ఇండియాదే వన్డే సిరీస్‌‌

రాణించిన మిథాలీ, రౌత్  ​
రెండో మ్యాచ్​లో సౌతాఫ్రికా ఓటమి

వడోదరా: కెప్టెన్‌‌ మిథాలీ రాజ్‌‌(82 బంతుల్లో 8 ఫోర్లతో 66), పూనమ్‌‌ రౌత్‌‌(92 బంతుల్లో 7 ఫోర్లతో 65) హాఫ్‌‌ సెంచరీలకు హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌(27 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌‌తో 39 నాటౌట్‌‌) మెరుపు ఇన్నింగ్స్‌‌ తోడవడంతో సౌతాఫ్రికా మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను ఇండియా 2–0తో మరో మ్యాచ్‌‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 247 రన్స్‌‌ చేసింది. వోల్‌‌వార్ట్‌‌ (69) హాఫ్‌‌ సెంచరీ చేయగా, డుప్రీజ్‌‌(44), లిజెల్లీ లీ(40), గూడాల్‌‌(38) కీలక ఇన్నింగ్స్‌‌ ఆడారు.

ఇండియా బౌలర్లలో శిఖా పాండే(2/38), ఏక్తా బిస్త్‌‌(2/45), పూనమ్‌‌ యాదవ్‌‌(2/42) రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో 48 ఓవర్లు ఆడిన ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి 248 రన్స్‌‌ చేసి గెలిచింది. ఓపెనర్లు ప్రియ పునియా(20), జెమీమా రోడ్రిగ్స్‌‌(18) స్వల్ప స్కోర్లుకే పెవిలియన్‌‌ చేరినా పూనమ్‌‌– మిథాలీ మూడో వికెట్‌‌కు 129 రన్స్‌‌ జోడించి విజయానికి బాటలు వేశారు. నాలుగు బాల్స్‌‌ తేడాలో ఈ ఇద్దరూ పెవిలియన్‌‌ చేరినా.. దూకుడుగా ఆడిన టీ20 కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ మరో రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని సులువుగా పూర్తి చేసింది. పూనమ్‌‌ రౌత్‌‌ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా ఎంపికైంది. సిరీస్‌‌లో చివరి వన్డే సోమవారం జరగనుంది.