నారాయణగూడ, వెలుగు: తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని... ఏపీ డిప్యూటీ సీఎం తన ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెడితే బాగుంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హితవు పలికారు. రాష్ట్రాలుగా విడిపోయిన , అన్నదమ్ములుగా కలిసి ఉన్నామని , ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సభల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టొదని కోరారు. దీనిని అదునుగా తీసుకొని కొంతమంది ప్రాంతీయ విబేధాలు సృష్టించాలని చూస్తున్నారని , పవన్ కళ్యాణ్ దీనిని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో ముందుకు సాగాలని దానం ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాయత్ నగర్ లో జరిగిన వేడుకల్లో దానం పాల్గొని... జాతీయ జెండాను ఎగురవేసి , జాతీయ గీతాన్ని , తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేకే కమిటీ ద్వారా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని దానం నాగేందర్ అన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని దానం స్పష్టం చేశారు.
