కాశీబుగ్గ/ నర్సంపేట, వెలుగు: నర్సంపేట డివిజన్లో మొక్కజొన్నల కొనుగోళ్లను స్పీడ్ అప్ చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్ లో నర్సంపేట ప్రాంతానికి సంబంధించిన మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు, నిల్వలపై ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యే మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారద సంబంధిత ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సుమారు 72 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా, 2.25 మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైందన్నారు.
అందుకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు, నిల్వలపై సమగ్రంగా సమీక్షించి, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి గోదాముల్లో తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని, నిల్వ సమయంలో నాణ్యత పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, అగ్రికల్చర్ జేడీ అనురాధ, డీసీవో నీరజ, డీఎం మార్క్‌ఫెడ్ రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

