అక్రమ మైనింగ్ కేసులో.. ఎమ్మెల్యే గూడెం తమ్ముడి అరెస్టు

అక్రమ మైనింగ్ కేసులో.. ఎమ్మెల్యే గూడెం తమ్ముడి అరెస్టు
  •     మధుసూదన్‌‌‌‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న  పటాన్‌‌‌‌చెరు పోలీసులు
  •     అనుమతులకు మించి సర్కారు భూముల్లో మైనింగ్
  •     లీజ్​ అగ్రిమెంట్​ ముగిసినా రెన్యువల్​చేయించలే
  •     తహసీల్దార్​ నివేదిక ఆధారంగా అరెస్ట్, రిమాండ్​
  •     పటాన్‌‌‌‌చెరు పీఎస్ వద్ద ఎమ్మెల్యే అనుచరుల వీరంగం

సంగారెడ్డి, వెలుగు :  అక్రమ మైనింగ్​ కేసులో పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు ఆరెస్ట్ చేశారు. మధుసూదన్​రెడ్డికి చెందిన ‘సంతోష్​ సాండ్​ మైనింగ్’ కంపెనీ అనుమతులకు మించి సర్కారు భూముల్లో మైనింగ్ చేయడంతో పాటు లీజ్​ అగ్రిమెంట్​ముగిసినా రెన్యువల్​ చేయించలేదని కలెక్టర్​ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘స్పెషల్​ టాస్క్​ఫోర్స్’​  తేల్చింది. దీంతో పటాన్ చెరు తహసీల్దార్ రంగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మధు అనుచరులు పెద్దసంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకొని వీరంగం సృష్టించారు.  పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు. 

అక్రమాలపై స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ నివేదిక..

పటాన్ చెరు మండలం లక్డారం గ్రామంలోని సర్వేనెంబర్ 738లో ‘సంతోష్​ సాండ్​ మైనింగ్’​పేరుతో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని మైనింగ్‌‌‌‌ కోసం మధుసూదన్ రెడ్డి లీజుకు తీసుకున్నాడు. దీంతోపాటు పక్కనే ఉన్న మరో 5.23 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా  మైనింగ్  కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు లీజు అగ్రిమెంట్ గడువు ముగిసినప్పటికీ  యథావిధిగా మైనింగ్ నిర్వహించడం, పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో ఆఫీసర్లకు   ఫిర్యాదులు అందాయి. అక్రమ మైనింగ్ పై అందిన కాంప్లెంట్స్​తో  జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గత నెలలో ఆరు శాఖల ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్​ ఏర్పాటుచేసి  ముమ్మరంగా సర్వే నిర్వహించారు.

కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా పటాన్ చెరు పరిధిలోని లక్డారం, రుద్రారం, చిట్కుల్ గ్రామాలలో ఐద మైనింగ్ సంస్థలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి గత నెల 22న వాటిని అప్పటి ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీజ్ చేశారు. అందులో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ సాండ్ మైనింగ్ కంపెనీ కూడా ఉంది.

ఏడాది క్రితమే నోటీసులు ఇచ్చినా.. 

అక్రమాల నేపథ్యంలో ఎమ్మెల్యే తమ్ముడు మధుసూదన్ రెడ్డికి సంబంధించిన సంతోష్ సాండ్ మైనింగ్ కంపెనీని మూసేయాలని ఏడాది క్రితమే అధికారులు నోటీసులు ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత ఫిబ్రవరిలో అక్రమ మైనింగ్ పై దృష్టి పెట్టి సంతోష్ సాండ్ మైనింగ్ కంపెనీ తోపాటు ఇదే గ్రామంలోని సర్వే నెంబర్ 738/1 లో ముత్తిరెడ్డి, జెరిపెట్టి వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్, రుద్రారంలోని సర్వే నెంబర్ 132లో మల్లికార్జునరావు క్వారీ, చిట్కుల్ గ్రామంలో సర్వే నెంబర్ 472లో శ్రీనిధి మెటల్ ఇండస్ట్రీ క్వారీలు అక్రమంగా కొనసాగుతున్నట్టు గుర్తించి వాటిపై చర్యలు చేపట్టారు.

కంది జైలుకు తరలింపు.. 

పటాన్ చెరు తహసీల్దార్​ ఫిర్యాదుతో  శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో మధుసూదన్​రెడ్డిని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పటాన్‌‌‌‌చెరు పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీస్ వాహనంపై రాళ్లు విసిరి వీరంగం సృష్టించారు. పరిస్థితిని చక్కదిద్దిన పోలీసులు అనంతరం మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి  మధుసూదన్​రెడ్డిని కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి ఈ నెల 28 వరకు కస్టడీ విధించారు. దీంతో ఆయనను కందిలోని జిల్లా జైలుకు తరలించారు.