కృష్ణా, గోదావరి నీటి వాటాలు కాపాడటంలో కాంగ్రెస్ ఫెయిల్ : ఎమ్మెల్యే హరీశ్ రావు

కృష్ణా, గోదావరి నీటి వాటాలు కాపాడటంలో కాంగ్రెస్ ఫెయిల్ : ఎమ్మెల్యే హరీశ్ రావు
  • నీళ్లన్నీ కిందికి వదిలి.. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ ఇస్తుండు: హరీశ్ రావు
  • పార్టీ నేతలతో కలిసి దేవాదుల దేవన్నపేట పంప్ హౌజ్ పరిశీలన
  • మూడు మోటార్లు నడిపించి పంటలకు సాగునీళ్లివ్వాలని డిమాండ్ 

హనుమకొండ, వెలుగు: కృష్ణా, గోదావరి నీళ్లలో తెలంగాణ వాటాను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. గోదావరిపై బనకచర్ల, నల్లమల్లసాగర్ కట్టి చంద్రబాబు నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే.. రేవంత్ రెడ్డి ఆయనకు గురుదక్షిణ చెల్లిస్తున్నాడని ధ్వజమెత్తారు.

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట సమీపంలోని దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌజ్​ను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం హరీశ్ రావు పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ నీటి వినియోగం రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనలోనే జరిగిందన్నారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం 34 శాతం వాటాను కూడా వినియోగించుకోవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

గోదావరి నదిలో కావాల్సినన్ని నీళ్లున్నాయని, రోజూ 16 వేల క్యూసెక్కుల నీరు కిందిపోతున్నా వాటిని ఎత్తిపోయడంలేదన్నారు. దేవన్నపేట పంప్ హౌజ్​లోని మూడు మోటార్లు పని చేయడం లేదని చెప్పారు. నిరుడు మోటార్లు నడిపించకపోవడం వల్ల 60 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు. గత పదిరోజుల నుంచి మోటార్లు పనిచేయక భీమ్ ఘన్ పూర్, గండిరామారం వరకు లిఫ్టులు ఆగిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో దేవాదుల ప్రాజెక్టులో పైసా పని చేయలేదన్నారు. ఇకనైనా దేవాదుల దేవన్నపేట పంప్ హౌజ్​లోని మూడు మోటార్లను నడిపించి సాగునీళ్లివ్వాలని డిమాండ్ చేశారు.