హైదరాబాద్, వెలుగు: జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది కార్మికులు కేసీఆర్ చొరవతో ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చారని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. జోర్డాన్, ఇజ్రాయెల్, గల్ఫ్‌వంటి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకుని వలస కార్మికుల బతుకులు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జోర్డాన్ నుంచి వచ్చిన 12 మంది వలస కార్మికులు శనివారం హరీశ్ రావును ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.." కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాం. వారికి సాయం అందించాలని కోరాం. అయినా ఎవరూ స్పందించలేదు. దాంతో కేసీఆర్ ఆదేశాల మేరకు జోర్డాన్ కంపెనీకి పెనాల్టీ కట్టి ఆ 12 మంది కార్మికులను తిరిగి తీసుకొచ్చాం. వీరిలాగే ఎంతో మంది ఉపాధి కోసం వెళ్లి వివిధ దేశాల్లో అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మన పిల్లల్ని మనం కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ఇప్పటికైనా వారి విషయంలో ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలి" అని కోరారు.
రేవంత్ తన హామీని నెరవేర్చలేదు
ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై హరీశ్ ఫైర్ అయ్యారు. " సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడ్తామని, వాళ్లకోసం ప్రత్యక పాలసీ తెస్తామని, నిధులు పెడతామని చెప్పారు. రెండేండ్లు అయినా స్పందన లేదు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మన రాష్ట్రం నుంచి 8 మంది బిజేపీ ఎంపీలు గెలిచారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ బిడ్డలను తీసుకురావడానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి" అని విజ్ఞప్తి చేశారు.
