V6 News

దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు సరిగాలేదు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై  సుప్రీం తీర్పు సరిగాలేదు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
  •     ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య 

వరంగల్‍, వెలుగు: సుప్రీం కోర్ట్  ఇటీవల దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని తీర్పు ఇచ్చిందని.. ఇది సరైంది కాదని స్టేషన్‍ ఘనపూర్‍ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం హనుమకొండ అంబేడ్కర్‍ భవన్‍లో నిర్వహించిన జయంతి కార్యక్రమాల్లో ఎంపీ కడియం కావ్యతో కలిసి పాల్గొని మాట్లాడారు. దేశంలోని కొందరు రాజ్యాంగానికి తూట్లు పొడవాలని చూస్తున్నారని, దళితుల రిజర్వేషన్లను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. అంబేడ్కర్‍ రచించిన రాజ్యాంగాన్ని ఇతర దేశాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. 

రాజ్యంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పార్లమెంట్‍లో ప్రవేశపెట్టబోతున్న మహిళా బిల్లుపై సైతం ఒక స్పష్టత లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్  కార్పొరేషన్‍  చైర్మన్‍  సిరిసిల్ల రాజయ్య, మేయర్‍ గుండు సుధారాణి, కలెక్టర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍ పాల్గొన్నారు.  

 రిజర్వేషన్ల తీర్పును పున: సమీక్షించాలే..

దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవనే సుప్రీం కోర్ట్  తీర్పును పున: సమీక్షించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍.నాగరాజు కోరారు. అంబేడ్కర్‍ జయంతి సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో వరంగల్​లో వాక్‍ ఫర్‍ ఈక్వాలిటీ విజ్ఞాన జ్యోతియాత్ర నిర్వహించారు. హసన్‍పర్తి మండల కేంద్రం నుంచి 500 వాహనాలతో బైక్‍ ర్యాలీ నిర్వహించారు. కేయూ జంక్షన్‍ నుంచి అంబేడ్కర్‍ జంక్షన్‍ వరకు యాత్ర కొనసాగింది. నాగరాజు మాట్లాడుతూ.. దేశంలో మతం పేరుతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులంతా దాడులకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‍ చైర్మన్‍ నగరగారి ప్రీతం, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‍ రియాజ్‍, వరంగల్‍ డీసీసీ అధ్యక్షుడు అయూబ్  పాల్గొన్నారు.