కంటోన్మెంట్ బీఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థిగా నివేదిత!

కంటోన్మెంట్ బీఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థిగా నివేదిత!
  •     సాయన్న కుటుంబం వైపే కేసీఆర్ మొగ్గు
  •     ఉగాది నాడు అధికారికంగా ప్రకటించే చాన్స్

హైదరాబాద్, వెలుగు : కంటోన్మెంట్ ఉప ఎన్నిక టికెట్‌‌ను దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లె నివేదితకు ఇవ్వడానికే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్నవారితో పాటు ఆ నియోజకవర్గ లీడర్లతో కేసీఆర్ ఆదివారం తన ఫామ్‌‌హౌజ్‌‌లో సమావేశం అయ్యారు. పార్టీ పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. సాయన్న చనిపోయిన కొంత కాలానికే, లాస్య నందిత కూడా చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సాయన్న కుటుంబంపై ప్రజల్లో సానుభూతి ఉందని వివరిస్తూ, ఆ ఫ్యామిలీలోని ఒకరికి టికెట్ ఇవ్వాలని తన నిర్ణయాన్ని కేసీఆర్ ప్రకటించినట్టు సమాచారం. 

సాయన్న కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తేనే పార్టీ గెలుస్తుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. సాయన్న చిన్న కూతురు నివేదితకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఉగాది రోజున నివేదిత పేరును అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్‌‌ రావు, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్​చార్జ్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, టికెట్ ఆశిస్తున్న గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, లాస్య నందిత తల్లి గీత, నివేదిత, నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు.

ఆ ముగ్గురికీ మళ్లీ నిరాశే

కంటోన్మెంట్ టికెట్‌‌ ఆశిస్తున్న ముగ్గురు లీడర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన సాయన్న, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లోనూ సాయన్నకే టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన చనిపోవడంతో, 2023 ఎన్నికల్లో సాయన్న పెద్ద బిడ్డ లాస్య నందితకు టికెట్ ఇచ్చారు. 

ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె.. ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఈ ఉప ఎన్నికలోనైనా తమకు టికెట్ వస్తుందని నగేశ్, క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆశించారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి భవిష్యత్‌‌లో అవకాశాలు లభిస్తాయని, నిరుత్సాహ పడొద్దని టికెట్ ఆశావహులను కేసీఆర్ బుజ్జగించినట్టుగా తెలిసింది.