
హైదరాబాద్, వెలుగు: ఏనాడు ప్రతిపక్షాలను గౌరవించని మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగా రెడ్డి అన్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఆయన బూతు పురాణం అందరికీ తెలుసన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ చరిత్ర అంతా తమకు తెలుసని, ఇప్పడు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో మీడియాను బెదిరించిన ఆయనకు మీడియా స్వేచ్ఛ గురిం చి మాట్లాడే అర్హత లేదన్నారు. కేసీఆర్ తన హయాంలో మంత్రులను కాపలా కుక్కల్లా చూడలేదా? అని ప్రశ్నించారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు విసిగి పోయారని, అందుకే ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. రంగారెడ్డి జిల్లాలో ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం భూములు కొల్లగొట్టిందని, బీఆర్ఎస్ పదేండ్ల అవినీతిని సీఎం, మంత్రులు బయటకు తీస్తున్నారని తెలిపారు.