- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, వెలుగు : తడిసిన వడ్లను కూడా ప్రభుత్వం కొంటుందని, ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి రైతులు ఆందోళన చెందొద్దని, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల తీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్తో ధాన్యం కొనుగోలు వారం రోజులు ఆలస్యం అయిందన్నారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ వేముల భాస్కర్, నాయకులు పడాల రాజన్న, తూం రాజు, వేముల అంజి, అజయ్రావు, మహేందర్, దాతు అంజి ఉన్నారు.
రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలి
తడిసిన, రంగు మారిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగాధర మండలం వెంకటాయపల్లిలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదని, నెల రోజులుగా తెలంగాణలో బాధపడని రైతు లేడన్నారు.
