మల్యాల, వెలుగు: తల్లిని కోల్పోయిన నలుగురు బిడ్డలకు తాను జీవితాంతం అండగా ఉంటానని, వారి బాధ్యత తీసుకుంటానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి భరోసా ఇచ్చారు. ఇటీవల చనిపోయిన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన కనక శారద ఇద్దరు కూతుళ్లను స్వయంగా తన కారులో తాటిపల్లి గురుకుల స్కూల్కు తీసుకెళ్లి ప్రవేశం కల్పించారు.
తన సొంత బిడ్డల్లాగే వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం అవసరమైన ప్రతి సాయం అందిస్తానని చెప్పారు. బాలికల పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రిన్సిపాల్ మానసకు సూచించారు. ఇటీవల శారద చనిపోగా ఆమె ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి.శ్రీనివాస్ గౌడ్, ఆనంద రెడ్డి, శంకర్ గౌడ్, ఆదిరెడ్డి, మిల్ట్రీ శ్రీను, సతీశ్ రెడ్డి, అనిల్, వినయ్, గాండ్ల జ్యోతి, లహరి తదితరులు పాల్గొన్నారు.
