
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా పాలన సాగుతుందని, తమ ప్రభుత్వ పాలన పట్ల ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. గత పదేండ్లలో సంతలో పశువులను కొన్నట్లు 65 మంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి కొనుగోలు చేసినప్పుడు విలువలు, నైతికత గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయన అవినీతి అంతా బయటకు తీస్తామని హెచ్చరించారు.
ఆదివారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీస్‌లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎంల మీటింగ్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న నిరంజన్.. గతంలో కేసీఆర్ రోజా ఇంటికెళ్లడం, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవ్వలేదా అని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత నిరంజన్‌కు లేదన్నారు. మేఘారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని అపహాస్యం చేసేలా నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు నామినేటేడ్ పదవి పొంది తర్వాత కేసీఆర్‌కు మందు పోసి దగ్గరయ్యారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎంఆర్వో ఆఫీసు తగలబెట్టించిన చరిత్ర నిరంజన్ రెడ్డిదని, ఇప్పుడు నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. కృష్ణా నదిని కబ్జా చేసి తోటలో ఫాంహౌస్ నిర్మించుకున్నారని, వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.