రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది : మైనంపల్లి

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది : మైనంపల్లి

న్యూఢిల్లీ, వెలుగు : బీఆర్ఎస్ మల్కాజ్‌‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీ రాజాజీ మార్గ్10 లోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో మైనంపల్లి హన్మంతరావు, తన కొడుకు రోహిత్‌‌రావు, నకిరేకల్‌‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరికి చెందిన కుంభం అనిల్‌‌కుమార్‌‌ రెడ్డి, సహా పలువురు నాయకులు హస్తం పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్‌‌ మాణిక్‌‌రావ్‌‌ థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డిల సమక్షంలో ఖర్గే కాంగ్రెస్‌‌ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సుమారు గంటన్నర పాటు మైనంపల్లి, రేవంత్‌‌రెడ్డి, థాక్రే, షబ్బీర్‌‌ అలీ, వంశీచంద్‌‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి, చిన్నారెడ్డి, సురేశ్ షెట్కర్, ఇతర సీనియర్ నేతలతో ఖర్గే ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల స్టాటజీపై నేతలతో చర్చించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి?, హైకమాండ్ నుంచి కావాల్సిన సపోర్ట్ తదితర అంశాలపై చర్చించారు. త్వరలో మల్కాజ్ గిరి వేదికగా భారీ సభ ఏర్పాటు అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. మల్కాజ్‌‌గిరి, మెదక్, నకిరేకల్‌‌ తో పాటు ఇతర నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులను ఖర్గే అడిగి తెలుసుకున్నారు. నేడు మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలువనున్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది : మైనంపల్లి

తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని మైనంపల్లి అన్నారు. ఖర్గేతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతోందని చెప్పారు. అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయని, రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్‌‌ గాలి వీస్తోందన్నారు. తప్పకుండా కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల ఆధారంగా హై కమాండ్‌‌ టికెట్స్‌‌ నిర్ణయిస్తుందని చెప్పారు. ఆ సర్వే రిపోర్ట్ ల ఆధారంగా తమకు(తనకు, కొడుకు)కు టికెట్స్‌‌ వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ కోసం పదేళ్ల పాటు కష్టపడి పనిచేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఇన్ చార్జ్ గా ఆ పార్టీకి పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించినట్లు చెప్పారు.

తాను ఎప్పుడూ ప్రజలతో ఉన్నానని, పార్టీ క్యాడర్‌‌ తనతోనే ఉందన్నారు. అధికారం ఎక్కడుంటుందో.. లీడర్లు అక్కడికి మారుతుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు భువనగిరికి చెందిన కుంభం అనిల్‌‌కుమార్‌‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌‌లో మళ్లీ చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్‌‌లో ఉన్న ప్రజాస్వామ్యం కారణంగా మళ్లీ సొంతగూటికి చేరానన్నారు.