
హైదరాబాద్ పాతబస్తీలోని జుమ్మెరాత్ బజార్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధురాలు, రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని పునర్మించేందుకు ఓ వర్గం ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళనకు దిగారు. మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేకుండా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించవద్దని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లురువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. రాజాసింగ్ ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అన్యాయంగా తమపై పోలీసులు దాడి చేశారని, దేశం కోసం పోరాడిన యోధురాలి విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే దాడి చేస్తారా అని పోలీసులపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.