చౌటుప్పల్, వెలుగు: వృద్ధులకు ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేంత వరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా తాను ఫించన్లు అందిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడనని, ప్రజల సంక్షేమం కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటానని తెలిపారు.
పెన్షన్ రాక చాలా మంది వృద్ధులు అవస్థలు పడుతున్నారని, వార్డుల వారీగా నిరుపేద వృద్ధులను గుర్తించి లిస్ట్ పంపిస్తే ప్రతి నెలా తమ ఫౌండేషన్ ద్వారా పెన్షన్ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అధికార పార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తేనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస నేత, పబ్బు రాజు గౌడ్, లింగస్వామి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
చండూరు: కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు సంధ్యారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దోపిడీకి, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన గొంతు వినిపించే పరిస్థితి వస్తే తాను ముందుంటానని చెప్పారు. ఇంటి స్థలాలు లేని నిరుపేదలందరికీ త్వరలోనే ప్రభుత్వ భూమి గుర్తించి ఇండ్లు కట్టించి ఇస్తామని తెలిపారు.
