నేషనల్​ హైవే విస్తీర్ణాన్ని పొడిగించండి : ఎమ్మెల్యే రామారావు పటేల్​

నేషనల్​ హైవే విస్తీర్ణాన్ని పొడిగించండి : ఎమ్మెల్యే రామారావు పటేల్​
  • దేగాం నుంచి భైంసాకు ఫోర్ లేన్​ రోడ్డు వేయండి
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించిన ఎమ్మెల్యే రామారావు పటేల్

భైంసా, వెలుగు: ముథోల్ ​నియోజకవర్గంలోని  నేషనల్​ హైవే 161 విస్తీర్ణాన్ని పొడిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎమ్మెల్యే రామారావు పటేల్​ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర మంత్రిని రామారావు పటేల్​కలిశారు. బాసర నుంచి ట్రిపుల్ ఐటీ వరకు ఫోర్ లేన్ రోడ్డు, భైంసా నుంచి మండలంలోని దేగాం వరకు ఫోర్ లేన్ రోడ్ వేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఏర్పాటు చేయాలని కోరారు. 

బెబ్​తరోడా నుంచి నిర్మల్ వరకు జాతీయ రహదారికి ప్రతి గ్రామం వద్ద రెండు వైపులా ఒక మీటర్ మేర విస్తీర్ణం పొడిగించి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఏడాది కాలంలోనే ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో 27 మంది చనిపోయారని, 67 మంది గాయపడ్డారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాను ప్రతిపాదించిన అంశాలపై నితిన్​గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ప్రారంభించండి

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి మీదుగా తాండూర్ నుంచి మహారాష్ట్ర గడ్చిరోలికి గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైవే పనులు వెంటనే ప్రారంభించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. 63 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు 2023లోనే కేంద్రం అనుమతిచ్చిందని, కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈ పనులు పూర్తయితే ఉత్తర తెలంగాణలో రవాణా, వ్యవసాయం, మార్కెటింగ్ అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. తాండూర్ మండలం బోయపల్లి నుంచి కల్వరి చర్చి వరకు సెంట్రల్ లైటింగ్, బెల్లంపల్లి వైజంక్షన్ వద్ద రేలింగ్, తాండూర్ పెట్రోల్ బంక్ వద్ద హైలెవల్ అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. 

మంత్రులకు స్వాగతం పలికిన కలెక్టర్

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద రూ.3,900 కోట్లతో మంచిర్యాల నుంచి వాంకిడి మండలం గోయగాం సరిహద్దు వరకు నిర్మించిన 4 వరుసల జాతీయ రహదారి ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర మంత్రులు సీతక్క, కోమటి రెడ్డి వెంకటరెడ్డిని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్ స్వాగతం పలికారు.