
హైదరాబాద్, వెలుగు : కేంద్ర మంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్ వ్యవహారమంతా బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలో భాగమని కాంగ్రెస్ లీడర్, ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్య ఎప్పట్నుంచో ఉంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి వెళ్లడం.. అవసరం లేకపోయినా ఆయన్ని అడ్డుకుని పోలీసులు హడావుడి చేయడం ప్లాన్డ్గా జరిగిందన్నారు.
గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్లో దుమారం చెలరేగుతున్నప్పుడు, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇక్కడ ఉండడం ఏంటని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డి ముందు మంత్రి పదవికి రాజీనామా చేసొచ్చి, తెలంగాణలో పర్యటించాలని డిమాండ్ చేశారు.