అడవిలో ఎమ్మెల్యే సీతక్క..30రోజులుగా నిత్యవసరాల పంపిణీ

అడవిలో ఎమ్మెల్యే సీతక్క..30రోజులుగా నిత్యవసరాల పంపిణీ
  • నిరుపేదలకు ములుగు ఎమ్మెల్యే చేయూత
  • 38 రోజులుగా నిత్యావసరాల పంపిణీ
  • అండగా నిలుస్తున్న  కార్యకర్తలు, దాతలు

ములుగు, వెలుగుదట్టమైన అడవులు.. నడుద్దామన్నా దారి లేదు.. పైకి చూస్తే భగ..భగ మండే 44 డిగ్రీల ఎండ. అయినా నెత్తిన 26 కేజీల కూరగాయల మూట. వాగులు దాటుతూ.. రాళ్లు రప్పలు, కొండలు, గుట్టలు ఎక్కుతూ దిగుతూ.. అడవి బిడ్డల దగ్గరకు చేరుకుని.. నిరుపేదల ఆకలి తీర్చడానికి శ్రమిస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వారాంతపు సంతలు బంద్ అయ్యాయి. కోయగూడాల ప్రజలకు నిత్యావసర వస్తువులు, సామగ్రి కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయింది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ములుగు జిల్లాలో ఉన్న నిరుపేదలు ఆకలితో అలమటించకుండా చూడాలని ఆమె కంకణం కట్టుకుంది. దారి లేని కోయగూడాలకు సైతం స్వయంగా కూరగాయల మూటలు మోసుకుంటూ.. పదుల కిలోమీటర్లు నడుస్తూ ఆదివాసీల ఆకలి తీరుస్తున్నారు. 38 రోజులుగా ఆదివాసీలకు నిత్యావసరాలు పంపిణీ  చేస్తున్నారు. కొండలు, కోనల్లో కోయగూడాల ప్రజల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్యే సీతక్క అదివాసీలతోపాటు పల్లె, పట్నం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. మార్చి 26న నిరుపేదలకు వారానికి సరిపడా నిత్యావసరాలను అందించే లక్ష్యంతో సీతక్క మొదలుపెట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దాతలు సైతం ముందుకు వచ్చి సీతక్క ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యంతోపాటు నూనె, ఉప్పు, పప్పులు, ఆరు రకాల కూరగాయలను అందజేస్తోంది. ముఖ్యంగా ములుగు జిల్లాలో 38 రోజులుగా అన్ని మండలాలను సీతక్క చుట్టొచ్చింది. సుమారు 400 గ్రామాలు, గొత్తికోయ గూడాల్లో తిరిగి ప్రజల ఆకలి తీర్చింది. సుమారు 40 వేల మంది ప్రజలకు లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​ కార్యకర్తలతోపాటు దాతల సహకారంతో ఇదంతా చేస్తున్నానంటూ సీతక్క చెబుతోంది.

అడవిలో 14 కి.మీ. కాలినడక

ములుగు జిల్లాలో దారి కూడా సరిగాలేని అటవీ గ్రామాలైన వెంకటాపూర్​మండలం బండ్లపాడు, ఊట్లు, కొర్రిచింతలపాడు, గోవిందరావుపేట మండలం దేవునిగుట్ల, తాడ్వాయి మండలంలోని జలగలంచ గొత్తికోయ గూడాలకు ట్రాక్టర్, కాలినడకన వెళ్లిన సీతక్క అక్కడి ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసింది. అదేవిధంగా జిల్లాలోని వాజేడు మండలం గుమ్మడి దొడ్డి నుంచి సుమారు 16 కి.మీ. అటవీ ప్రాంతంలో ప్రయాణించి పెనుగోలు గ్రామానికి వెళ్లింది. 2 కి.మీ. మేర బైక్​ మీద వెళ్లిన సీతక్క అనంతరం వాగులు దాటుకుంటూ సుమారు 14 కి.మీ. కాలినడకన మండుటెండలో పెనుగోలు గ్రామానికి 6 గంటల ప్రయాణం అనంతరం చేరుకుంది. ములుగు సబ్​రిజిస్ట్రార్​తస్లీం మహ్మద్​తో కలిసి వెళ్లిన సీతక్క అక్కడి ప్రజలకు నిత్యావసరాలను అందజేశారు. కష్టకాలంలో అడవిలో అంతదూరం కాలినడకన వెళ్లి పేదల ఆకలి తీర్చిన సీతక్కను అంతా అభినందిస్తున్నారు.