కాంగ్రెస్ కార్పొరేటర్​పై  ఎమ్మెల్యే అనుచరుల దాడి

కాంగ్రెస్ కార్పొరేటర్​పై  ఎమ్మెల్యే అనుచరుల దాడి
  •     వనస్థలిపురం విద్యుత్ విజయోత్సవ సభలో ఉద్రిక్తత
  •      కార్పొరేటర్ అనుచరుడి పైనా దాడి చేసిన సుధీర్​రెడ్డి వర్గం
  •     పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్

ఎల్​బీ నగర్, వెలుగు: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభలో పాల్గొన్న కాంగ్రెస్ కార్పొరేటర్​ దర్పల్లి రాజశేఖర్​పై ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎల్​బీ నగర్​ వనస్థలిపురంలోని ఎంవీ గార్డెన్​లో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. సభలో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదని, ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రైతులకు 9 గంటల విద్యుత్ అందించారన్నారు. ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నారని, ప్రతిపక్షాలు ఏమీ చేయలేదని, అన్నీ గాలిమాటలేనని విమర్శించారు. దీంతో కార్పొరేటర్ రాజశేఖర్ మరోసారి మాట్లాడేందుకు మైక్​కావాలని అడిగారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే మనుషులు స్టేజ్ పైకి వచ్చి రాజశేఖర్​తో పాటు ఆయన అనుచరుడు ప్రవీణ్​రెడ్డిని పక్కకు తీసుకెళ్లి దాడి చేశారు. ఈ ఘటనపై రాజశేఖర్ వనస్థలిపురం పీఎస్​లో కంప్లయింట్ చేశారు. తనపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై చర్యలు తీసుకోవాలని  కాంగ్రెస్ నాయకులు మల్ రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి తో కలిసి  పోలీసులను కోరారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కొంతకాలంగా సుధీర్ రెడ్డి అనుచరుల దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్​నుంచి పోటీ చేసిన సుధీర్​రెడ్డి కోసం తామంతా కలిసి పనిచేసి గెలిపించుకున్నామని.. కానీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపైనే ఇప్పుడు దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు పీఎస్​ముందు కూర్చొన ధర్నా చేపట్టారు. సుధీర్ రెడ్డిపై కేసు ఫైల్ చేయాలని డిమాండ్ చేశారు