- ఢిల్లీకి నజరానా.. రైతులకు జరిమానా అన్నట్లు రేవంత్పరిపాలన: హరీశ్‌రావు
- వడ్ల కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు చెప్తున్నరు
- యూరియా అమ్మకాలు నిషేధించి రైతు వారోత్సవాలు చేయడం సిగ్గుచేటు
- బీఆర్ఎస్కార్యకర్తలను ఇబ్బంది పెడ్తున్న అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరిక
చౌటుప్పల్/సూర్యాపేట, వెలుగు: వడ్ల కుప్పలపై రైతులు చనిపోతున్నా సీఎం పట్టించుకోరా అని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, వడ్ల కొనుగోలు తీరును తెలుసుకున్నారు. కాంటా వేశాక లారీలు రావడం లేదని రైతులు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్ పరిపాలన ఢిల్లీకి నజరానా.. రైతులకు జరిమానా అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఏసీ గదుల్లో కూర్చొని, వడ్ల కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కొనుగోళ్లు సాఫీగా జరిగితే రైతులు ఎందుకు రోడ్లెక్కుతున్నారో చెప్పాలన్నారు.
తరుగు తీస్తే తోలు తీస్తానన్న రేవంత్.. ఇప్పుడు బస్తాకు 3 కిలోల తరుగు తీస్తుంటే ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌చేశారు. కొనుగోళ్లు గాలికొదిలేసి, యూరియా అమ్మకాలపై నిషేధం పెట్టి రైతు వారోత్సవాలు చేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో ఏనాడూ ఇంతటి దారుణ పరిస్థితులు లేవన్నారు. మంచిర్యాలలో అకాల వర్షాలకు గోడ కూలి ముగ్గురు రైతులు, నల్గొండ జిల్లాలో వడ్ల కుప్పలపై ఓ రైతు గుండె ఆగి చనిపోయాడని, ఇంకెంత మంది బలైతే మీకు సోయి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు, ఆయిల్ పామ్ పండించే రైతులకు యూరియా అమ్మొద్దని బోర్డులు పెట్టడం ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. వాతావరణ శాఖ అకాల వర్షాలు, తుపాన్హెచ్చరికలు జారీ చేస్తోందని, ప్రభుత్వం తక్షణమే మేల్కొని యుద్ధప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. కరోనా మనుషుల ప్రాణాలు తీస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తోందని హరీశ్‌రావు ఫైర్అయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
