టార్గెట్‌‌ యూత్!.. ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ పార్టీల పాట్లు

టార్గెట్‌‌ యూత్!.. ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ పార్టీల పాట్లు

యాదాద్రి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు నెలలు సమయం ఉన్నా.. ఆ వేడి మాత్రం అప్పుడే మొదలైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి.  యాదాద్రి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అపొజిషన్‌‌‌‌ నేతలు యువతే లక్ష్యంగా ఉచిత హామీలు ఇస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు యువతకు ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌ ఇస్తామని, కావాల్సిన వాళ్లు పార్టీ లీడర్లకు అప్లికేషన్లు పెట్టుకోవాలని సూచించారు.  దీన్ని సవాల్‌‌‌‌గా తీసుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌తో పాటు హెల్మెట్‌‌‌‌ కూడా ఇస్తామని ప్రకటించారు. ఇక బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న మరో నేత జాబ్‌‌‌‌ మేళా ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోటీపోటీగా పోస్టులు పెడుతున్నారు. 

50 శాతం యువ ఓటర్లు 

యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని యువ ఓటర్లు (40 ఏండ్ల లోపు)  50 శాతం ఉన్నారు. ప్రస్తుతమున్న లెక్కల ప్రకారం ఆలేరు నియోజకవర్గంలో 2,16,642 ఓటర్లు ఉండగా..  19 ఏండ్లలోపు ఓటర్లు 725 మంది, 30 ఏండ్లలోపు 36,244, 40 ఏండ్లలోపు 63,095, 50 ఏండ్లలోపు 41,078, 60లోపు 32,398, 70 లోపు 23,206, 80లోపు 14811, 80 ఏండ్లకు పైబడిన వారు 5085 మంది ఓటర్లున్నారు.  భువనగిరి విషయానికొస్తే మొత్తం 2,01,434 మంది ఓటర్లు ఉండగా.. 19 ఏండ్లలోపు  1001, 30 ఏండ్లలోపు 36,012, 40 ఏండ్లలోపు 59,145, 50 ఏండ్లలోపు 38,999, 60లోపు 29,745, 70 లోపు 20,027, 80లోపు 12,151, 80ఏండ్లకు పైబడిన వారు 4354 మంది ఉన్నారు.  

నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకొని..

30 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్న ఓటర్లు ఏదో ఒక పని చేస్తూ ఉపాధి పొందడం కామన్.  30 ఏండ్లలోపు ఉన్న యువత ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.  ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వంపై కోపంగా ఉంది.  అందుకే ఈ కేటగిరి ఓటర్లను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ చేసింది.  ఇందులో భాగంగానే  భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల  శేఖర్​రెడ్డి, గొంగిడి సునీత 18 నుంచి 27 ఏండ్ల వయసున్న ఓటర్లకు టూ వీలర్, ఫోర్​ వీలర్​ డ్రైవింగ్ లైసెన్స్​ ఫ్రీగా ఇప్పిస్తానని ప్రకటించారు.  కావాల్సిన వాళ్లు తమ ఆధార్​ సహా పూర్తి వివరాలను పార్టీ లీడర్లకు అందించాలని సూచించారు.  దీంతో డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌‌‌‌ నుంచి భువనగిరి అసెంబ్లీ టికెట్‌‌‌‌ఆశిస్తున్న కుంభం అనిల్​కుమార్​రెడ్డి మరో అడుగు ముందుకేసి  లైసెన్స్​తో పాటు హెల్మెట్‌‌‌‌ కూడా ఇప్పిస్తానని ప్రకటించాడు.  ఇక మరోప్రధాన పార్టీ బీజేపీ నుంచి టికెట్​ ఆశిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి జాబ్​మేళా ప్లాన్​ చేస్తున్నారు. ఈయన గతంలో పోటీపరీక్షలకు రెండు నెలల పాటు కోచింగ్​ ఇప్పించారు.  అలాగే ఆలేరులో కాంగ్రెస్​ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న బీర్ల అయిలయ్య గ్రామాల్లో వాటర్​ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నాడు. ఈ మేరకు లీడర్ల తరఫున పార్టీల కేడర్​ సోషల్​ మీడియాలో పోస్టింగ్‌‌‌‌లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. 

పోటాపోటీగా సెంటర్లు

ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌, లైసెన్స్‌‌‌‌తో పాటు హెల్మెట్ ఇస్తామని ప్రకటించిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి శనివారం పోటాపోటీగా సెంటర్లు ఏర్పాటు చేశారు.  అందులో సిబ్బందిని పెట్టి లైసెన్స్​కోసం వచ్చిన వారి నుంచి ధ్రువపత్రాలు తీసుకుంటున్నారు. దీనిపై యువత కూడా మిశ్రమంగా స్పందిస్తోంది. ఏ పార్టీ అయితే ఏంది..? తమకు లైసెన్స్‌‌‌‌ వస్తే చాలని కొందరు యువకులు చెబుతుంటే..  రూ. 2 వేలు ఖర్చయ్యే లైసెన్స్‌‌‌‌ కోసం నాయకులు చుట్టూ తిరగాలా..? అని ఇంకొందరు అంటున్నారు.