
- సీఎం కేసీఆర్, కేటీఆర్ ఉంటేనే హాజరు
- మధ్యాహ్నం దాటితే దాదాపు ఖాళీ
- మంత్రుల చాంబర్లలో ఎమ్మెల్యేలు
- ప్రతిపక్ష సభ్యులదీ అదే తీరు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. నామినేటెడ్ సభ్యుడితో కలిపి మొత్తం 120 మంది ఉండాల్సిన సభలో, వంద మంది కూడా ఉండట్లేదు. తొలి రోజు కాస్త పర్వాలేదనిపించినా, రెండో రోజు నుంచి సభ్యు ల అటెండెన్స్ పడిపోతున్నది. సభా నాయకుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు సభలో ఉంటున్నారు. ఈ ఇద్దరు లేనప్పుడు సభ్యుల సంఖ్య 50 కూడా దాటడం లేదు. మధ్యాహ్నం సెషన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి 30 నుంచి 40 మంది మాత్రమే ఉంటున్నారు. గురు వారం సాయంత్రం పద్దులపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చే టైంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి 29 మందే ఉన్నారు. ఇందులో ప్రతిపక్ష సభ్యులే ఏడుగురు ఉండగా, అధికార పక్షం సభ్యులు 22 మంది ఉన్నారు. అసెంబ్లీకి వచ్చినప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు హాల్‌లో ఉండకుండా, లాబీలో, మంత్రుల చాంబర్లలో కనిపిస్తున్నారు. సభలో ఉండకపోవడంపై రిపోర్టర్లు ప్రశ్నిస్తే.. తమ నియోజకవర్గాల్లోని సమస్యలు పరిష్కరించాలని కోరేందుకే మంత్రుల వద్దకు వెళ్తున్నామని చెబుతున్నారు. సభలో సమస్యలు లేవనెత్తడానికి అవకాశం లేదని, అందుకే సభ బయట మంత్రులను కలుస్తున్నామంటున్నారు. ఇక సభలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష సభ్యులు కూడా సభలో కొంతసేపు, బయట కొంతసేపు ఉంటున్నారు. ఇంకొంత మంది ఎమ్మెల్యేలైతే అటెండెన్స్ వేయించుకోవడానికే వస్తున్నాం అన్నట్లుగా.. సభలో కాసేపు ఉండి వెళ్లిపోతున్నారు.
స్పీకర్ మందలించినా మారుతలే..
అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు లేవనెత్తే సమస్యలకు మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ అవర్‌లో తమ సెగ్మెంట్లోని సమస్యలు లేవనెత్తేందుకు సభ్యులకు స్పీకర్ టైమ్ ఇస్తున్నారు. ఈ టైంలో కొందరు ఎమ్మెల్యేలు, తామే మంత్రులం అన్నట్టుగా ప్రభుత్వ పథకాలను, ఘనతలను పొగుడుతూ ప్రసంగం చేస్తున్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంలోనూ మంత్రులు చెప్పాల్సిన సమాధానాలను వీళ్లే చెబుతున్నారు. సభ్యులు తమకు ఇచ్చిన టైంను వినియోగించుకోవాలని, మంత్రుల తీరుగా ప్రసంగాలు ఇవ్వొద్దని ఇప్పటికే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పలుమార్లు మందలించారు. అయినా, కొంత మంది ఎమ్మెల్యేలు అదేపనిగా ప్రసంగాలిస్తుండడంపై సొంతపార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.