- విప్‌లు ఆదిశ్రీనివాస్, విజయ రమణారావు, రాంచంద్రు నాయక్ డిమాండ్
- రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా
- సుస్మిత వ్యాఖ్యల వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది
- ఇందుకు ఆమె నైతిక బాధ్యత వహించాల్సిందే
- ఆమె తీరు బీసీల గౌరవాన్ని మంటగలిపేలా ఉందన్న ఎమ్మెల్యేలు
- రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత క్షమాపణ చెప్పాల్సిందేనని విప్‌లు, పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్‌చేశారు. సుస్మిత వ్యాఖ్యల వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని, కానీ ఆమె వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఖండించకపోవడం క్షమించరాని విషయమన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై హైకమాండ్చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ శుక్రవారం 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజాగా, శనివారం విప్‌లు ఆది శ్రీనివాస్ , విజయ రమణారావు, రాంచంద్రు నాయక్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సీఎల్పీలో ప్రెస్‌మీట్‌పెట్టి కొండా సురేఖ తీరును ఖండించారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను తామంతా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలమంతా సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. సురేఖతోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి ..ఎవరైనా సరే సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ముగ్గురి విషయంలో పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు.
సుస్మిత వ్యాఖ్యలు క్షమించరానివి: ఆది శ్రీనివాస్
మంత్రి సురేఖను వ్యక్తిగతంగా గౌరవిస్తామని, కానీ ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకుంటే వివాదం ముగిసిపోయేదని, కానీ ఈ విషయంలో సురేఖ తీరు సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మంత్రి కొండా సురేఖ ఆత్మవిమర్శ చేసుకొని కూతురు సుస్మితతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కొండా సుస్మిత ఏనాడైనా ప్రజాక్షేత్రంలో ఉన్నారా? ప్రజల కోసం పనిచేశారా?’’ అని విప్ రాంచంద్రు నాయక్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి విషయంలో సుస్మిత వాడిన భాష సరిగ్గా లేదని, ఆమె మాటలను కొండా సురేఖ ఎందుకు ఖండించలేదన్నారు.
మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. మంత్రి హోదాను అనుభవిస్తూ ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టకుండా, కుటుంబ సభ్యులతోనే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడించడం సంస్కారహీనమేనని మండిపడ్డారు. నైతిక బాధ్యతవహించి సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. మంత్రి సురేఖను సీఎం రేవంత్ రెడ్డి తన సోదరిలా చూశారని, ఆమె మాత్రం సొంత బిడ్డ మాటలను ఖండించలేదని విప్ విజయ రమణా రావు మండిపడ్డారు. సురేఖ, ఆమె కూతురు సుస్మిత ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారని, అయినప్పటికీ తన కూతురి మాటలతో తనకు సంబంధం లేదని సురేఖ బుకాయింపు మాటలు మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కూతురుతోపాటు సురేఖ కూడా సీఎం రేవంత్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. కొండ సురేఖను తామంతా అక్కా అని పిలుస్తామని, కానీ ఇప్పుడు ఆమెవల్ల పార్టీ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు బీసీల గౌరవాన్ని మంటగలిపేలా ఉన్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
పీసీసీ చీఫ్‌కు మీనాక్షి ఫోన్
రాష్ట్ర కాంగ్రెస్‌లో గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. శనివారం ఆమె పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేసి మంత్రి కొండా సురేఖ వివాదంపై అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విప్‌లు, పలువురు ఎమ్మెల్యేలు రెండు రోజులుగా నిర్వహిస్తున్న మీడియా సమావేశాలపైనా ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, ఎమ్మెల్యేలంతా కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలను తప్పుపడుతున్నారనే విషయాన్ని మీనాక్షికి పీసీసీ చీఫ్ వివరించినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి.
