V6 News

ఏజన్సీ అభివృద్ధికి సహకరించండి..సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు వినతి పత్రం

ఏజన్సీ అభివృద్ధికి సహకరించండి..సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు వినతి పత్రం

మణుగూరు, వెలుగు : ఏజన్సీ ఏరియాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. మంగళవారం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం సీఎం నివాసంలో కలిసి పలు సమస్యలపై చర్చించినట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో బోర్లు వేసి ప్రభుత్వమే విద్యుత్ సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరామన్నారు.

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు అనువైన ప్రదేశాల్లో చెక్ డ్యామ్ లను నిర్మించడం, మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు, బ్రిడ్జిలు, కొత్త రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ నుంచి అనుమతులు ఇప్పించడంతోపాటు గిరిజన అభివృద్ధికి ప్రాణాధారమైన ఐటీడీఏలను బలోపేతం చేయాలని కోరినట్లు చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం గిరిజన ప్రాంతాల సమస్యలను త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్​రెడ్డి, పినపాక, ఖానాపూర్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, వెడ్మ బొజ్జు, మురళీ నాయక్, పాల్గొన్నారు.