బీజేపీ, బీఆర్ఎస్ ట్రాప్‌‌‌‌లో పడొద్దు : ఎమ్మెల్సీ బల్మూరి

బీజేపీ, బీఆర్ఎస్ ట్రాప్‌‌‌‌లో పడొద్దు : ఎమ్మెల్సీ బల్మూరి
  • ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ బల్మూరి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే ఈ నివేదికపై  రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ పార్టీల ట్రాప్‌‌‌‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యా కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ అని, నివేదిక ఇవ్వడం సాధారణమని తెలిపారు. దానిని అమలు చేయాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. 

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయ ఖాళీలు నింపలేదని, డీఎస్సీ నోటిఫికేషన్‌‌‌‌లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆ పార్టీ ఆడుకుందని విమర్శించారు. కనీసం బదిలీలు కూడా చేపట్టకుండా ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని, ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ఉపాధ్యాయులను రెచ్చగొట్టేలా మాజీ మంత్రి హరీశ్ రావు వ్యవహరిస్తున్నారని, ఆయనకు ‘బీ టీమ్‌‌‌‌’లా బండి సంజయ్ సహకరిస్తున్నారని ఆరోపించారు.