ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో టఫ్ ఫైట్

ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో టఫ్ ఫైట్
  • రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ హోరాహోరీ
  • రాత్రి రెండు గంటల తర్వాత ‘వరంగల్​’ తొలిరౌండ్​ లెక్కింపు పూర్తి
  • ఫస్ట్​ రౌండ్​లో పల్లాకు 16 వేలు, మల్లన్నకు 12 వేలు, కోదండరాంకు 9 వేలు!
  • రాత్రి 3 దాటినా పూర్తికాని ‘హైదరాబాద్​’ మొదటి రౌండ్ లెక్కింపు
  • బీజేపీ, టీఆర్​ఎస్​ మధ్య తీవ్ర పోటీ
  • ఈరోజు రాత్రికి రెండు స్థానాల్లో ఫస్ట్​ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్​ పూర్తయ్యే చాన్స్​
  • ఆ ఓట్లతో తేలకుంటే ఎలిమినేషన్​ ప్రాసెస్​.. మరింత లేట్​ కానున్న ఫైనల్​ రిజల్ట్​

నల్గొండ/హైదరాబాద్​, వెలుగు: రెండు గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. క్యాండిడేట్ల మధ్య టఫ్​ఫైట్​ నడుస్తోంది. వరంగల్​– నల్గొండ– ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి, ఇండిపెండెంట్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న, టీజేఎస్​ అభ్యర్థి ప్రొఫెసర్​ కోదండరాం మధ్య హోరా హోరీ నెలకొంది. హైదరాబాద్​– రంగారెడ్డి – మహబూబ్​నగర్​ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాంచందర్​రావు, టీఆర్​ఎస్​ క్యాండిడేట్​ వాణీదేవి మధ్య ఇదే పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్​ అభ్యర్థి ప్రొఫెసర్​ నాగేశ్వర్, కాంగ్రెస్​ అభ్యర్థి చిన్నారెడ్డి కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. రెండు చోట్ల ఓట్ల లెక్కింపు స్లోగా సాగుతోంది. బుధవారం ఉదయమే కౌంటింగ్​ ప్రాసెస్​ ప్రారంభమైనా 10 నుంచి 14 గంటలు బండిల్స్​ కట్టడానికే సరిపోయింది. రాత్రి రెండు గంటలకు ‘వరంగల్’ నియోజకవర్గానికి సంబంధించిన ఫస్ట్​ రౌండ్​ కౌంటింగ్​ పూర్తయింది. ‘హైదరాబాద్’  నియోజకవర్గానికి సంబంధించి ఫస్ట్​ రౌండ్​ కౌంటింగ్​ రాత్రి 11 గంటలకు మొదలైంది. రాత్రి 3 గంటల వరకు కూడా మొదటి రౌండ్​ లెక్కింపు పూర్తికాలేదు.
 

‘వరంగల్​’లో పల్లా, మల్లన్న, కోదండరాం
వరంగల్– నల్గొండ– ఖమ్మం గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ఫస్ట్​ రౌండ్​ లెక్కింపు వివరాల ప్రకారం.. టీఆర్​ఎస్​ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డికి 15,990 ఫస్ట్​ ప్రయారిటీ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఇండిపెండెంట్​అభ్యర్థి తీన్మార్​ మల్లన్న 12,567 ఓట్లతో సెకండ్​ ప్లేస్​లో, టీజేఎస్ ​క్యాండిడేట్​ కోదండరాం సుమారు​9వేల ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. పల్లా రాజేశ్వర్​రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్​ మల్లన్న కన్నా 3 వేలకు పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్​లో 56వేల ఓట్లు లెక్కించగా, సుమారు 3 వేల ఓట్లు చెల్లకుండా పోయాయని సమాచారం. 

 

‘హైదరాబాద్‌’లో బీజేపీ, టీఆర్‌ఎస్‌
 హైదరాబాద్​– రంగారెడ్డి – మహబూబ్​నగర్​ నియోజకవర్గంలోని తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీ నెలకొంది.  బుధవారం రాత్రి మొదలైన  ఫస్ట్​ రౌండ్​ కౌంటింగ్​లో ఒక టేబుల్‌లో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం ఉంటే, మరో టేబుల్‌లో బీజేపీ ముందు వరుసలో ఉంది. 

రెండు నియోజకవర్గాల్లో కౌంటింగ్‌‌ ఆలస్యంగా సాగుతోంది. మొత్తం ఏడు రౌండ్లలో కౌంటింగ్​ చేపడుతున్నారు. ‘హైదరాబాద్​’ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్​ సరూర్​నగర్​లోని ఇండోర్​ స్టేడియంలో చేపట్టారు. ‘వరంగల్​’కు సంబంధించి నల్గొండలో చేపట్టారు. నల్గొండలో బుధవారం ఉదయం 8 గంటలకు ఓట్లను కట్టలు కట్టే పని ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటలకు పూర్తయింది. దాదాపు సాయంత్రం 5.30 గంటలకు మొదటి రౌండ్​ లెక్కింపు ప్రారంభం కాగా,  రాత్రి రెండు గంటలకు కౌంటింగ్​ పూర్తయింది. అయితే రిజల్ట్​ను అధికారికంగా ప్రకటించలేదు. మొదటి రౌండ్​లో భాగంగా 56 వేల ఓట్లు లెక్కించేందుకు ఏకంగా ఏడు గంటల టైం పట్టింది. ఇంకా ఆరు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. ఈ ప్రకారం ఫస్ట్​ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి గురువారం సాయంత్రం 6 గంటలు అవుతుందని, అప్పటికి ఎవరికీ మెజారిటీ రాకుంటే ఎలిమినేషన్​ ప్రక్రియ మొదలవుతుందని ఎన్నికల ఆఫీసర్లు చెప్తున్నారు. మొదటి రౌండ్​ ఫలితాల ట్రెండ్​, తర్వాతి రౌండ్లలోనూ కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిమినేషన్​ తప్పదని, అదే జరిగితే ఫలితం తేలేందుకు శుక్రవారం వరకు కూడా టైం పట్టొచ్చని అంటున్నారు. హైదరాబాద్​లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాత్రి 3 గంటల వరకు ఇక్కడ ఫస్ట్​ రౌండ్​ ఫలితం రాలేదు. ఉదయం 8 గంటలకు బండిల్స్​ కట్టే ప్రాసెస్​ స్టార్టవగా.. రాత్రి 10.30 గంటలకు పూర్తయింది. రాత్రి 11 గంటలకు ఫస్ట్​ రౌండ్​ కౌంటింగ్​ మొదలు పెట్టారు. మొత్తం 7 రౌండ్ల కౌంటింగ్​ పూర్తవడానికి గురువారం రాత్రి కావొచ్చని అంచనా వేస్తున్నారు. 
 

ఎనిమిది హాళ్లలో ఏడు టేబుళ్ల పై లెక్కింపు.. 
నల్గొండలో మొత్తం ఎనిమిది కౌంటింగ్‌‌  హాళ్లు ఏర్పాటుచేయగా, ఒక్కో హాలులో ఏడు టేబుళ్లు ఏర్పాటుచేశారు. ఈ 7 టేబుళ్లపై 13 బూత్‌‌ లకు సంబంధించిన బ్యాలెట్‌‌  పేపర్లను కట్టలు కట్టారు. ఒక్కో రౌండుకు ఒక్కో బూత్​కు సబంధించిన బ్యాలెట్‌‌ బాక్సులను ఇచ్చారు. ఇలా మొత్తం 56 టేబుళ్లపై 13  బూత్​లకు సంబంధించిన బ్యాలెట్‌‌ పేపర్లను కట్టలు కట్టారు. సీరియల్‌‌  ప్రకారం కాకుండా మూడు జిల్లాలను కలుపుతూ ఆయా టేబుళ్లకు బ్యాలెట్‌‌ బాక్సులను అప్పగించి, కట్టలు కట్టారు. ఉదయం 8 తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నం12 గంటల వరకు దాదాపు 50శాతం బండిల్స్‌‌  కట్టే ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల అధికారులు రాత్రి 8గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని భావించగా, మూడు గంటల ముందుగానే సాయంత్రం 5 గంటలకు 100శాతం కట్టలు కట్టేశారు. ఆ తరువాత బండిళ్లను 8 కౌంటింగ్​హాళ్లలో ఉన్న 7 టేబుళ్ళకు ఒక్కో టేబుల్‌‌పైకి వెయ్యి ఓట్ల చొప్పునచేర్చారు. ఇలా సాయంత్రం 6గంటల 20 నిమిషాలకు మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 

 

కౌంటింగ్​ కేంద్రాల వద్ద అభ్యర్థుల్లో ఉత్కంఠ
నల్గొండలోని కౌంటింగ్‌‌  కేంద్రాలకు ఉదయమే అధికార పార్టీ క్యాండిడేట్​ పల్లా రాజేశ్వరరెడ్డి తో పాటు తెలంగాణ ఇంటి పార్టీ డాక్టర్‌‌  చెరుకు సుధాకర్‌‌, కాంగ్రెస్‌‌ పార్టీ అభ్యర్థి రాములు నాయక్‌‌, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్​ రెడ్డి, లెఫ్ట్​ పార్టీ అభ్యర్థి జయసారథిరెడ్డి, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడే ఉండి సాయంత్రం ఫస్ట్​ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు టైంలో తిరిగి కౌంటింగ్‌‌ హాల్​ కు చేరుకొని కౌంటింగ్​ తీరును పరిశీలించారు. లెక్కింపు జరుగుతున్నంత సేపు అభ్యర్థుల్లో అంతకంతకూ ఉత్కంఠ కనిపించింది. ఉదయం నుంచి ఎన్నికల రిటర్నింగ్‌‌  ఆఫీసర్, కలెక్టర్‌‌ ప్రశాంత్‌‌  జీవన్‌‌ పాటిల్‌‌  కౌంటింగ్‌‌ ప్రక్రియను పర్యవేక్షించారు. ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించారు. జిల్లా ఎస్పీ ఆవుల వెంకట రంగనాథ్​ కౌంటింగ్‌‌ కేంద్రానికి 11గంటల టైంలో వచ్చి కలెక్టర్ తో కలిసి కేంద్రాలను, స్ర్టాంగ్‌‌  రూంలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. 

 

షిఫ్టుల వారీగా డ్యూటీలు
రెండు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్​ సిబ్బందికి షిఫ్టుల వారీగా డ్యూటీలు ఏర్పాటు చేశారు. నల్గొండలో ఉదయం 6 గంటలకు కౌంటింగ్‌‌  ప్రక్రియ కోసం వచ్చిన అధికారులు, సిబ్బంది సాయంత్రం 6గంటల వరకు విధులు నిర్వహించారు. ఆ తరువాత రెండో షిఫ్టుకు సంబంధించి ఆఫీసర్లు, స్టాఫ్​ రాగానే  మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. లెక్కింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్గొండ కలెక్టర్​ప్రశాంత్​ జీవన్​పాటిల్​ వెల్లడించారు. కౌంటింగ్​ సెంటర్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

 

సీఎం కేసీఆర్‌కు లెటర్లు..
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో పలు లెటర్లు బయటపడుతున్నాయి. హైదరాబాద్​లోని సరూర్ నగర్ స్టేడియంలో ఎన్నికల స్టాఫ్‌కు బ్యాలెట్‌ పేపర్లతో పాటు లెటర్లు కనిపించాయి. వికారాబాద్ జిల్లాకు చెందిన 251 పూడూరు పోలింగ్ బూత్‌లో మూడు లెటర్లు రాగా, కోస్గికి చెందిన బూత్​ నెంబర్ 158లో మరో రెండు లెటర్స్ బయట పడినట్లు తెలిసింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ఓటు హక్కు వినియోగించుకునే టైంలో కొందరు నిరుద్యోగ యువత, ఫీల్డ్‌ అసిస్టెంట్లు కేసీఆర్‌కు లెటర్‌ రాశారు. అందులో తమ బాధ, సమస్యలను విన్నవించుకున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ లేఖలో ఫీల్డ్ అసిస్టెంట్లు వేడుకున్నారు. ‘‘ఏటా ఉద్యోగ నియామకాల క్యాలెండర్‌ను ప్రకటించాలి. రైతు బంధు స్కీం వల్ల రాష్ట్ర ప్రజలకు భారం పడుతోంది. గ్రామపంచాయతీ, సర్పంచ్‌లు చాలా అవినీతికి పాల్పడుతున్నారు. అభివృద్ధి లేదు. విమర్శలు చేసే వారిపై దాడులుకు పాల్పడుతున్నారు. హోంగార్డులను తొక్కేస్తున్నారు’’ అని ఓ లెటర్​లో  పేర్కొన్నారు. ‘‘తెలంగాణ వచ్చినంక నిరుద్యోగం బాగా పెరిగింది. డిగ్రీలు, పీజీలు చదివి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. రైతు బంధు ఎత్తేయాలి. 5 ఎకరాలు భూమి ఉన్న ప్రతి పేద, మధ్య, సన్నకారు రైతులకు మాత్రం ఇవ్వాలి. భూస్వాములకు, దొరలకు, రెడ్లకు కాదు ఇచ్చేది.’’ అని వేరొక లెటర్​లో పేర్కొన్నారు.

కౌంటింగ్‌పై అనుమానాలు
-వరంగల్–నల్గొండ–- ఖమ్మం గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌పై కొన్ని  అనుమానాలు ఉన్నాయి. దీనిపై ఎన్నికల కౌంటింగ్ సెంటర్‌లో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ను కలిసి విన్నవించా. ఎన్నికల కౌంటింగ్ లో అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. 
- కోదండరాం, టీజేఎస్‌ క్యాండిడేట్

 

లెక్కలు తారుమారు
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు చేసిన ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కానీ కొన్ని బ్యాలెట్ బాక్సుల్లో లెక్కలు తారుమారుగా కనిపించాయి. దీనిపై కొంత అనుమానంగా ఉంది.
- చిన్నారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి 

బ్యాలెట్‌‌ బాక్సులకు తాళాల్లేవ్
నల్గొండలో కౌంటింగ్ హాల్ దగ్గర ఏజెంట్ల నిరసన

నల్గొండ, వెలుగు: నల్గొండలో జరుగుతున్న కౌంటింగ్‌ కేంద్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన బ్యాలెట్‌ బాక్సుల తాళాలు తీసి ఉండడంపై ఏజెంట్లు ఆందోళనకు దిగారు. దీంతో కౌంటింగ్‌‌ హాల్‌ పక్కన ఉన్న మీడియా సెంటర్‌‌ ముందు ఏజెంట్లు నిరసనకు దిగారు. ఎన్నికల అధికారులు.. అధికార పార్టీకి వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయంపై బీజేపీ క్యాండిడేట్‌ ప్రేమేందర్‌రెడ్డి, ఇండిపెండెంట్‌‌ అభ్యర్థి సుదగాని హరిశంకర్‌‌ గౌడ్‌‌, సీపీఎం నాయకుడు పుచ్చకాయల నర్సిరెడ్డిలు కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేయడంతో వీడియో కెమెరాల సమక్షంలో బాక్సులు ఓపెన్‌ చేయించారు. దీంతో ఆందోళన విరమించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం 175 పోలింగ్ బూత్​లో  603 ఓట్లు పోలైనట్లు వుంది. కానీ కౌంటింగ్ లో 31 ఓట్లు తక్కువగా రావడంతో కౌంటింగ్ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ఏజెంట్లు నిరసన తెలిపారు. ఓట్ల గల్లంతుపై విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. 

వరంగల్ ఎమ్మెల్సీ స్థానం
ఉదయం 8-గంటలు: 25 బ్యాలెట్ల చొప్పున బండిల్స్ కట్టడం స్టార్ట్​
సా. 5:30 గంటలు: బండిల్స్ కట్టడం పూర్తయి మొదటి రౌండ్​ కౌంటింగ్ ప్రారంభం
అర్ధరాత్రి 2 తర్వాత: మొదటి రౌండ్ రిజల్ట్​ వివరాలు
ఇంకా లెక్కించాల్సిన రౌండ్లు: 6
మొదటి రౌండ్​కు దాదాపు ఏడు గంటలు టైమ్ పట్టింది. మిగతా ఆరు రౌండ్లకు ఒక్కో దానికి మూడు గంటల చొప్పున టైమ్​ తీసుకున్నా  కౌంటింగ్​ పూర్తవడానికి సుమారు 18–-20 గంటలు పట్టే చాన్స్ ఉంది. అప్పటి వరకు మొదటి ప్రాధాన్య ఓట్ల ప్రకారం విజేత తేలకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.  దీంతో తుది ఫలితానికి ఇంకో రోజు పడుతుంది.

హైదరాబాద్​ ఎమ్మెల్సీ స్థానం
ఉదయం 8 గంటలు: 25 బ్యాలెట్ల చొప్పున బండిల్స్ కట్టడం స్టార్ట్​
రాత్రి 11 గంటలు: బండిల్స్ కట్టడం పూర్తయి మొదటి రౌండ్​ కౌంటింగ్ ప్రారంభం
అర్ధరాత్రి 2 గంటలు: మొదటి రౌండ్ రిజల్ట్ ఇంకా ప్రకటించలేదు
ఇంకా లెక్కించాల్సిన రౌండ్లు: 6
దాదాపు ఆరున్నర గంటల టైమ్ తర్వాత కూడా మొదటి రౌండ్​రిజల్ట్​రాలేదు. ఇంకా ఆరు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. ఒక్కో దానికి మూడు నుంచి నాలుగు గంటల చొప్పున టైమ్​ తీసుకున్నా కౌంటింగ్ పూర్తవడానికి సుమారు 18–-24 గంటలు పట్టొచ్చు. అప్పటికీ విజేత తేలకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.