ఎమ్మెల్సీ కవిత.. బీసీ మహిళల వ్యతిరేకి : దాసు సురేష్

ఎమ్మెల్సీ కవిత.. బీసీ మహిళల వ్యతిరేకి : దాసు సురేష్

ముషీరాబాద్, వెలుగు: ‘ఎమ్మెల్సీ కవిత బీసీ మహిళల వ్యతిరేకి.. అగ్రవర్ణ మహిళల పక్షపాతి.. అందుకే బీసీ మహిళల పక్షాన గళం విప్పడం లేదు’ అని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్​విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క బీసీ మహిళకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ.. పార్లమెంటులో మహిళా బిల్లు తెచ్చిందా? అని  ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్​ బాగ్ లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి నేతృతంలో మహిళా రిజర్వేషన్​ బిల్లు కాపీలను కాల్చివేశారు. 

బీసీ రిజర్వేషన్లు లేకుండా మహిళా రిజర్వేషన్లు అర్థరహితమని.. బీసీ మహిళలకు సబ్ కోట లేని మహిళా బిల్లు మాకొద్దని తేల్చిచెప్పారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఆ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును వెంటనే సవరించి బీసీలకు, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళలకు సబ్ కోటా లేని బిల్లును కాంగ్రెస్ ఆమోదించి చారిత్రక తప్పిదం చేసిందన్నారు. బీసీ బిల్లు అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచని పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామన్నారు. బిల్లును ఆమోదించే వరకు జాతీయ రహదారులను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.