బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు

బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనాన్ని సమర్పించారు. ఆమె స్వయంగా బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చారు. ఆమె వెంట బీఆర్​ఎస్​ నేతలు ఉన్నారు. బోనాల జాతరకు ఉదయం నుంచి  వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.  ఆలయాన్ని బంతి పూలు, పూల తోరణాలు, వేపాకు,  విద్యుత్‌ దీపాలతో  సుందరంగ అలంకరించారు. అమ్మవారిని హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్​రెడ్డి, సీఎస్​ శాంత కుమారి దర్శించుకున్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత బీఆర్​ఎస్​ శ్రేణులతో భారీ బందోబస్తుతో బయల్దేరారు.   
ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారికి సాక, ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు, పోతరాజుల నృత్యం, బలిగంప, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.  అమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేసినట్లు తలసాని చెప్పారు. ఉత్సవాలను స్క్రీన్​పై చూసేందుకు ఆలయం చుట్టూ ఆరు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.  పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణం, అంజలి థియేటర్ ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మూడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జనరల్‌ బజార్‌, మహంకాళి పోలీస్​ స్టేషన్ల  వద్ద అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.