అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం పెట్టండి: ఎమ్మెల్సీ కవిత

అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం పెట్టండి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటుకు బీసీలంతా ఏకం కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్​లో నిర్వహించిన భారత​జాగృతి రౌండ్​టేబుల్​మీటింగ్​లో ఆమె మాట్లాడారు. బీసీల అభ్యున్నతే ధ్యేయంగా భారత్‌ జాగృతి పోరాటం చేస్తుందని.. ఇందులో భాగంగా అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు సాధన లక్ష్యంగా ఉద్యమిస్తుందని తెలిపారు. ఏప్రిల్ 11 వరకు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇప్పటికే  అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్​కు వినతిపత్రం అందించామని గుర్తుచేశారు. బీసీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించామని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంఘసంస్కర్తల జయంతిలను అధికారికంగా నిర్వహించామని తెలిపారు. మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు దక్కాయని వివరించారు.