ప్రభుత్వ ప్రోగ్రామ్​కు ప్రియాంకను ఎట్ల పిలుస్తరు: ఎమ్మెల్సీ కవిత

ప్రభుత్వ ప్రోగ్రామ్​కు ప్రియాంకను ఎట్ల పిలుస్తరు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ అధికారంలో ఉన్న పదేండ్లలో అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని తాను అడుగలేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇప్పుడు ఫూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని భారత్​ జాగృతి ఆధ్వర్యంలో ప్రస్తుత సర్కారును అడుగుతున్నామని, ఏర్పాటు చేస్తారా లేదా అన్నది సుత్తి లేకుండా సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్​లోని తన నివాసంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 11లోగా సానుకూల ప్రకటన చేయాలన్నారు. ఫూలే విగ్రహ సాధన కోసం ఈ నెల 6 నుంచి 10 వరకు అన్ని జిల్లాల్లో రౌండ్​టేబుల్​సమావేశాలు నిర్వహిస్తామని, ఈ నెల 12న ధర్నా చౌక్​లో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి బీసీని ముఖ్యమంత్రి చేయాలని కవిత అన్నారు. రేవంత్​రెడ్డి ప్రభుత్వాన్ని తాము పడగొట్టాల్సిన అవసరం లేదని.. నల్గొండ, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్​ నాయకులే పడగొడుతారని వ్యాఖ్యానించారు. 

ప్రియాంకను ఆహ్వానిస్తే నల్లబెలూన్లతో నిరసన

 పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇంద్రవెల్లి సభకు పెట్టిన ఖర్చు ఎంత, వసతులు కల్పించినందుకు ప్రభుత్వానికి కాంగ్రెస్​ పార్టీ డబ్బు చెల్లించిందా అనేదానికి సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ హెలికాప్టర్​లో వెళ్లి పార్టీ సభలో పాల్గొనడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ‘‘సీఎం అన్న విషయం మరిచి ముఠామేస్త్రీలా రేవంత్ ​మాట్లాడుతున్నరు. రూ.500 గ్యాస్​ సిలిండర్​పథకం ప్రారంభోత్సవానికి ప్రియాంకను ఆహ్వానిస్తామని సీఎం అంటున్నరు. ఆమెను ఏ హోదాలో పిలుస్తారో చెప్పాలి. 

ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానిస్తే నల్లబెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుం” అని కవిత అన్నారు. రేవంత్ ​ప్రత్యేక విమానాల్లో తరచూ ఢిల్లీకి వెళ్లివస్తున్నారని, అందుకు ఖర్చు ఎంత అయ్యిందో సమాధానం చెప్పాలన్నారు. శిశుపాలుడి వంద పాపాలు పండినట్లుగా వందరోజులకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు పండుతాయని, అప్పుడు ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పారు.  కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించకున్నా సీఎం, డిప్యూటీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వెంటనే కుల గణన చేపట్టి బీసీలకు స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, రాబోయే బడ్జెట్​లో బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్​కేటాయించాలని డిమాండ్​చేశారు.