- త్వరలో 108, 102, ఫైర్ వంటి అత్యవసర సేవలు
- ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలకు వాట్సాప్ మీ సేవలో భారీ స్పందన
- మధ్యవర్తులకు ‘చెక్’.. 8096958096 నంబర్‌తో సేవలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో డిజిటల్ సేవ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, మీసేవ కేంద్రాల ముందు క్యూ కట్టే అవసరం లేకుండా తీసుకొచ్చిన ‘వాట్సాప్ మీసేవ’ విధానం సామాన్యుడి బాగా ఉపయోగపడుతున్నది. గత నవంబర్ 18న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సేవలు మంచి రిజల్ట్స్‌ను ఇస్తున్నాయి.
దీంతో రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ సేవలను కూడా వాట్సాప్ ద్వారా అందించేలా ప్రభుత్వం భావిస్తున్నది. 108, 102, అగ్నిమాపక సేవలకు 101, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్, ముఖ్యమైన హెల్ప్ లైన్ నెంబర్లన్నీ దీనికి లింక్ చేయనున్నారు.
సర్టిఫికెట్లకు భారీ స్పందన
నవంబర్ నుంచి స్పీడప్ అయిన ఈ విధానం ద్వారా ఇప్పటివరకు సుమారు 4.5 లక్షల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. వీరిలో 3.25 లక్షల మంది విజయవంతంగా తమకు కావాల్సిన సర్టిఫికెట్లను, సేవలను పొందారు. మొత్తం 10కి పైగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి 581 రకాల పౌర సేవలు ఇప్పుడు వాట్సాప్ చాట్ బాక్స్ తో అందుతున్నాయి.
వాట్సాప్ మీసేవలో ప్రధానంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు పోటెత్తుతున్నారు. వీటితో పాటు బర్త్, డెత్, రెసిడెన్సీ సర్టిఫికెట్లు, పోలీస్ చలాన్లు, రేషన్ షాపుల రెన్యూవల్, బిల్డింగ్ పర్మిషన్లు, ప్రాపర్టీ ట్యాక్స్ వంటి సేవలపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని 31 ప్రముఖ దేవాలయాల దర్శనం, వసతి గదుల బుకింగ్ కూడా ఇందులో అందుబాటులో ఉండటంతో పెద్ద ఊరట కలిగిస్తున్నది.
మధ్యవర్తులు లేకుండా..
గతంలో చిన్న సర్టిఫికెట్ కావాలన్నా మీసేవ కేంద్రాల చుట్టూ తిరగడం, మధ్యవర్తుల చేతిలో మోసపోవడం జరిగేది. ఇప్పుడు 80969 58096 నంబర్‌తో ఆ తిప్పలన్నీ తప్పినట్టయ్యింది. ఒక్క మెసేజ్ పంపడం ద్వారా ప్రశ్నలు అడగవచ్చు. దరఖాస్తు చేయవచ్చు. చెల్లింపులు పూర్తి చేసి నేరుగా సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పౌర సేవల్లో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకువచ్చింది. డిజిటల్ టెక్నాలజీపై అవగాహన లేని వారు సైతం సులభంగా దీన్ని వాడుకునేలా డిజైన్ చేయడంతో అందరికీ చేరువైంది.
