జనమే మా జట్టు.. వందకుపైగా సీట్లు గెలుస్తం

జనమే మా జట్టు.. వందకుపైగా సీట్లు గెలుస్తం
  • జనమే మా జట్టు.. వందకుపైగా సీట్లు గెలుస్తం
  • బీజేపీ బీసీ సీఎం ప్రకటన 
  • ఎన్నికల జిమ్మిక్కే: ఎమ్మెల్సీ కవిత   

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ ​జట్టు అని.. తమకు ఏ పార్టీతోనూ పొత్తులేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లలో గెలుస్తామని, కేసీఆర్​ హ్యాట్రిక్​ సీఎం అవుతారన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు వాళ్ల సొంత సర్వేల్లో మాత్రమే గెలుస్తాయని.. ప్రజలు మాత్రం తమనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ట్విట్టర్​లో ‘‘ఆస్క్​కవిత” హ్యాష్​ట్యాగ్​తో నిర్వహించిన లైవ్​చాట్​లో ఆమె నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

బీజేపీ బీసీ సీఎం ప్రకటన ఎన్నికల జిమ్మిక్కేనన్నారు. రాష్ట్రంలో బీజేపీ.. బీసీ అధ్యక్షుడిని తొలగించి అగ్రవర్ణాలకు పగ్గాలు అప్పగించిందని విమర్శించారు. కేంద్రం బీసీల కుల గణనకు ఎందుకు నిరాకరిస్తోంది? మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఎందుకు స్థానం కల్పించలేదో చెప్పాలన్నారు. రాహుల్ ​గాంధీ కుటుంబం తెలంగాణకు ఎంతో అన్యాయం చేసిందని, ఆంధ్రతో కలపడంతో 60 ఏండ్లు వెనక్కి పోయామన్నారు. 

రాహుల్, ప్రియాంక ఎన్నికలప్పుడే వచ్చి కపట ప్రేమ చూపిస్తారని, ఆ తర్వాత మళ్లీ కనిపించరన్నారు. ఢిల్లీ లిక్కర్​స్కామ్​పై స్పందిస్తూ “రాజకీయ కుట్రలో పావును కాను. ధైర్యంగా కొట్లాడే పటిమ నాకు ఉంది” అని చెప్పారు. ఈ వయసులో చంద్రబాబు అరెస్ట్  దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.