చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని కార్మికుల భారీ ర్యాలీ

చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని కార్మికుల భారీ ర్యాలీ

చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. జీరో శాతానికి జీఎస్టీ అమలు చేయాలని కోరారు. చేనేత కార్మికులు  రాసిన లక్షలాది పోస్ట్ కార్డులను  ఆబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేశామన్నారు. హ్యాండ్లూమ్  అండ్ పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్లు, నేతన్నలకు మద్దతు తెలిపారని చెప్పారు.  కేంద్రం జీఎస్టీని అమలు చేయడం వల్ల చేనేత కార్మికులు  ఇబ్బందులు గురవుతున్నారన్నారు.వారసత్వంగా వచ్చే చేనేత  వృత్తిపై కేంద్రం పన్నులు విధించడం దారుణమన్నారు. 

చేనేత పరిశ్రమలపై ఐదు శాతం జీఎస్టీని ఎత్తివేసే వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా  పోరాడుతామని ఎల్ రమణ అన్నారు. నేత కార్మికులు అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసిన లక్షలాది పోస్టుకార్డులను  ప్రధానమంత్రి మోడీకి పంపుతున్నామన్నారు. చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  నిజాం కాలేజ్ గ్రౌండ్ నుంచి అబిడ్స్ పోస్టాఫీస్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు.  ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, హ్యాండ్లూమ్ అండ్  పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. 

అయితే ర్యాలీలో పాల్గొన్నవారికి టీఆర్ఎస్ పార్టీ లీడర్లు  టోకెన్లు ఇచ్చారు . టోకెన్లు ఇస్తేనే..5వందల రూపాయలు ఇస్తున్నారన్నారు ర్యాలీకి వచ్చినవారు. నిరసన కార్యక్రమం తర్వాత..సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన ప్లకార్డులను రోడ్డుపై పడేసి..టోకెన్లు తీసుకుని వెళ్లిపోయారు.