- 20 వేల శాంపిల్స్‌లో 2 వేల మంది అనర్హులే
- కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు
- ఉన్నోళ్లూ తీసుకుంటున్నరు
- 50 ఏండ్లు నిండకున్నా
- వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నరు
- గత ప్రభుత్వ హయాంలో రాజకీయ
- ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలన లోపం
- కారణంగానే బోగస్ పింఛన్లు
- నాలుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు పూర్తి
హైదరాబాద్, వెలుగు: నిరుపేదలు, నిస్సహాయులకు అందాల్సిన సామాజిక పింఛన్లు పక్కదారిపడుతున్నాయి. నెలనెలా లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకూ ‘చేయూత’ అందుతున్నది. కార్లు, పెద్దపెద్ద బంగ్లాలు ఉన్నోళ్లు, ఆఖరికి పెట్రోల్ బంకులు నడిపేవాళ్లు, వారి కుటుంబ సభ్యులు సైతం నెలనెలా పింఛన్ తీసుకుంటున్నారు. వైక్యలం లేకున్నా దివ్యాంగ పింఛన్, 50 ఏండ్లు నిండకున్నా వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్నవారు ఉన్నారు.
ఇక, చనిపోయిన వ్యక్తులకూ ఏడాది కాలంగా పింఛన్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన సోషల్ ఆడిట్‌లో ఇవన్నీ వెలుగుచూశాయి. నాలుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ సామాజిక తనిఖీల్లో ఏకంగా 10 శాతం మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేయూతలో అనర్హుల ఏరివేతకు సర్కారు సిద్ధమవుతున్నది.
20 వేల శాంపిల్స్‌లో 2 వేలమంది అనర్హులే..
చేయూత కింద సామాజిక పింఛన్లు అందుకుంటున్నవారిలో పెద్ద సంఖ్యలో అనర్హులున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అనర్హుల గుర్తింపు కోసం ‘పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ’ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు కింద 4 జిల్లాల్లో ‘సోషల్ ఆడిట్’ చేపట్టింది. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపాలిటీ, కరీంనగర్ కార్పొరేషన్, వనపర్తి జిల్లాలో ఆత్మకూరు, ఆదిలాబాద్ జిల్లాలో మావల గ్రామాల్లో ఇటీవలే సామాజిక తనిఖీలు పూర్తికాగా, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రెండు రూరల్, అర్బన్ మండలాల్లో 5 వేల నుంచి 6 వేల చొప్పున పింఛన్ల శాంపిల్స్ తీసుకొని ఈ సర్వే నిర్వహించగా, దాదాపు10 శాతం మంది అనర్హులు ఉన్నట్టు తేలింది. మొత్తం 20 వేల నుంచి 25 వేల మందిని వెరిఫై చేస్తే ఇందులో 2 వేలకు పైగా అనర్హులకు పింఛన్ అందుతున్నట్లు తేలింది.
ఇందులో దాదాపు 400 నుంచి 500 మంది చనిపోయినవారి పేరిట ఇంకా పింఛన్ తీసుకుంటూనే ఉన్నారు. ఒక్క కరీంనగర్ కార్పొరేషన్‌లోనే దాదాపు 800 మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటుంటే.. ఇందులో చనిపోయిన వారి పింఛన్లు 300 వరకు ఉన్నాయి. చనిపోయి నెలలు, ఏండ్లు గడుస్తున్నా వారి పేర్లు జాబితా నుంచి తొలగించలేదు. ఆ డబ్బులను కుటుంబ సభ్యులో, లేక స్థానిక సిబ్బందో కాజేస్తున్నారు. అంతేకాకుండా.. ఊరిలో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, ట్రాక్టర్లు, చివరికి పెట్రోల్ బంకులు ఉన్న బడాబాబులు కూడా వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లాలో ఓ రిటైర్డ్ఆర్టీసీ డ్రైవర్, మరో జిల్లాలో సీఐ తల్లి పింఛన్లు తీసుకుంటున్నారని తేలింది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు పింఛన్‌కు అనర్హులు. కానీ, అనేక మంది ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలన లోపం కారణంగానే ఈ బోగస్ పింఛన్లు పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. ఆధార్ సీడింగ్ సరిగ్గా లేకపోవడం, డెత్ సర్టిఫికెట్లు వెంటనే అప్డేట్ కాకపోవడం అక్రమార్కులకు వరంగా మారినట్లు భావిస్తున్నారు.
బ్యాంకు ఖాతాలో నిధుల జమతో అవకతవకలు
గ్రామాల్లో ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొని పింఛన్ఇస్తుం టారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారి పింఛన్లను కార్యదర్శులు డ్రా చేసే వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలో పింఛన్తీసుకునే వ్యక్తి చనిపోతే డెత్ సర్టిఫికెట్ఇవ్వకుం డా వారి పేరుపై పింఛన్లు కాజేస్తున్నట్టు తెలిసింది. పోస్టాఫీసు కంటే బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగేచోట అవకతవకలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఎక్కువగా మున్సిపాలిటీల్లో చనిపోయినవారి పేర్లపై పింఛన్ తీసుకుంటున్నట్లు తేలింది. ఇక్కడ నేరుగా బ్యాంకు ఖాతాలో జమవుతుండటంతో ఆ వ్యక్తి బతికి ఉన్నాడా? లేక చనిపోయాడా? అనేది వారి బంధువులో, కుటుంబసభ్యులో చెప్పేంతవరకు తెలియడం లేదు. ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసే చాన్స్ఉండడంతో అనర్హులను గుర్తించడం సవాల్‌గా మారింది.
ఈ విషయం గురించి గత సర్కారుకు ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదంటున్నారు. అక్రమ పింఛన్లను నియంత్రించేందుకు ఇప్పటికే బ్యాంకుల్లో ఏటా కేవైసీ సమర్పించాలని 6 నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పింఛన్ లబ్ధిదారులు ఆధార్, ఫొటో, బ్యాంకు ఖాతా వివరాలు, లైఫ్సర్టిఫికెట్ఇవ్వాలని కోరింది. దీనిద్వారా లబ్ధిదారుడు బతికి ఉన్నాడా? లేక చనిపోయాడా? అన్నది తెలుస్తుంది. అయితే, ఈ వివరాలను ఎవరూ ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో లబ్ధిదారుడు కేవైసీ సమర్పించకపోతే పింఛన్ తాత్కాలికంగా నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సర్కారు ఉద్యోగులు కూడా చాలా మంది మల్టిపుల్ అకౌంట్ల ద్వారా పింఛన్ తీసుకుంటుండగా, బ్యాంకు ఖాతాలతో ఆధార్ లింక్‌చేయాలని చూస్తున్నది.
రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా..
రాష్ట్రంలో పలు శాఖల్లో రెగ్యులర్ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్విధానంలో పనిచేస్తున్నవారు కూడా పింఛన్ తీసుకుంటున్నట్టు సర్కారుదృష్టికి వచ్చింది. ఈ క్రమంలో సెర్ప్నుంచి ఆయా శాఖల హెచ్‌వోడీలకు లెటర్లు వెళ్లాయి. వారికి పింఛన్లు తొలగించడంతోపాటు ఇప్పటికే తీసుకున్న పింఛన్డబ్బులను రికవరీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు, సంక్షేమ, సెర్ప్‌తో పాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు సైతం ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
సర్కారుకు చేరిన నివేదిక
సోషల్ఆడిట్కు సంబంధించిన పూర్తి నివేదిక పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది.పైలెట్ ప్రాజెక్టు మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా అనర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల బోగస్ పింఛ న్లు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేసి.. అనర్హులను తొలగించడంతోపాటు అర్హులైన కొత్తవారికి అవకాశం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్తున్నారు.
సూర్యాపేటలో ఓ వ్యక్తికి మూడంతస్తుల బిల్డింగ్ ఉంది. కోటీశ్వరుడైన ఆయన ప్రస్తుతం నెలనెలా వృద్ధాప్య పింఛన్పొందుతున్నాడు. ఇదే మున్సిపాలిటీలో మరో వ్యక్తికి పెట్రోల్ బంక్ ఉంది. ఈ కుటుంబం నుంచి కూడా ఒకరు పింఛన్ తీసుకుంటున్నారు. అలాగే, సర్కిల్ఇన్స్పెక్టర్ తల్లి కూడా పింఛన్లు తీసుకుంటున్నారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్‌లో దాదాపు 200 నుంచి 300 మంది చనిపోయినవారి పేర్లపై వారి కుటుంబ సభ్యులు పింఛన్లు పొందుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురంలో పింఛన్లకు సంబంధించి విచిత్రాలు బయటపడ్డాయి. ఇక్కడ ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి భార్య వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నది. ఇదే గ్రామంలో చనిపోయిన వ్యక్తుల పేరిట పింఛన్లు తీసుకుంటున్నట్లు ఆడిట్‌లో తేలింది.
42.67 లక్షల పింఛన్‌దారులు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 42.67లక్షల మంది పింఛన్ తీసుకుంటున్నారు. 11 కేటగిర్లీలో ప్రభుత్వం పింఛన్ అందజేస్తున్నది. దివ్యాంగుల కు రూ.4,016 ఇస్తుండగా..మిగిలిన వారికి 2,016 ఇస్తున్నది. 2024–25లో 42.67 లక్షల మందికి రూ.14,628.91 కోట్లు బడ్జెట్ కేటాయిం చగా..ఇందులో ప్రతి నెలా రూ.1000.47 కోట్లు పింఛన్‌దారులకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. పోస్ట ల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ప్రామాణి కంగా 22.72 లక్షలు (53 %), బ్యాంకుల ద్వారా 19.95 లక్షలు (47 శాతం) పంపిణీ జరు గుతున్నది.
